హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దిగువ కోర్టు ల్లో కొత్త న్యాయాధికారుల నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా చేస్తున్న నాగారం అంజయ్య సహా పలువురు ప్రభుత్వ ప్లీడర్లు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ జరిపారు. ప్రస్తుతమున్న లా ఆఫీసర్ల స్థానంలో పనిచేయడానికి ప్రత్యామ్నాయ/తాతాలిక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించిందని, మూడేండ్ల కాలానికి నియమితులైన వారిని కాదని కొత్త ప్లీడర్లను నియమించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త న్యాయాధికారులను నియమించకుండా తాత్కాలిక స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ప్రభు త్వ న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.