హైదారాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రైతులు పంట రుణాల కోసం, ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రైతులకు దీర్ఘకాలిక రుణాలివ్వాలని రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు ఉన్నాయని, దీనిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.
అయినా బ్యాంకులు మాత్రం రైతులకు రుణాలివ్వడం లేదని తెలిపారు. దీనిపై 2018 నుంచి రైతు రక్షణ సమితి న్యాయ పోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారం సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ఖాన్పేట ఎస్బీఐ శాఖ నుంచి 8 మంది రైతులకు ప్రైవేట్ అప్పులు తీర్చుకునేందుకు రూ.4.90 లక్షల రుణాలు మంజూరైనట్టు పేర్కొన్నారు.