హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకారంతో ‘రైతు రత్న అవార్డులు’ ప్రదానం చేయనున్నట్టు తెలంగాణ అగ్రికల్చర్ అసోసియేషన్ చైర్మన్ బీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. సుస్థిర, సమీకృత, వినూత్న వ్యవసాయ, ఉద్యానపంటల సాగు, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయరంగంలో విశేషంగా రాణించే రైతులకు ఈ పురస్కారాలకు ఎంపిక చేయనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డిసెంబర్ 3,4 తేదీల్లో కన్హశాంతివనంలో నిర్వహించే మహాకిసాన్ మేళా-2025లో ఈ అవార్డులు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఈ పురస్కారాలకు ఈనెల 20లోగా తమ దరఖాస్తులను పంపవచ్చని తెలిపారు. దరఖాస్తులను స్థానిక వ్యవసాయ అధికారులకు లేదా పోస్టు ద్వారా ఇంటి నంబర్ 1-4-298/4, వీధి నంబర్ -1, అశోక్‌నగర్ హైదరాబాద్-500020 లేదా taoahyd@gmail.com ద్వారా పంపవచ్చునని సూచించారు.