హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : మైనారిటీ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మైనారిటీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టెంరీస్) పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో పోస్టులు భర్తీ చేయనున్నది. టీజీటీలు (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్), పీజీటీలు (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్), జూనియర్ లెక్చరర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిప్యూటీ వార్డెన్ తదితర పోస్టుల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణపత్రాలతో నాంపల్లిలోని హజ్ హౌస్‌లో ఈ నెల 29 లోపు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఐఐటీ, జేఈఈ, నీట్, సీఎంఏ, క్లాట్, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల కోర్సుల అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన బోధనా సిబ్బందిని దరఖాస్తుల కోసం ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది. మొత్తం 117 పోస్టుల్లో ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సీఈవో పోస్టులు 50, డిస్ట్రిక్ట్ సీఈవో పోస్టులు 67 ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నెల 30 లోపు సరూర్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. వివరాలకు వెబ్సైట్ లేదా 040 2300 5100 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నది.