సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : ధూపదీప నైవేద్య పథకం ద్వారా పురాతన దేవాలయాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన ఆలయాలకు నెలకు రూ.4,000, అర్చకులకు రూ.6,000 గౌరవ భృతి కింద చెల్లిస్తారని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సహాయం పొందడానికి అర్హత కలిగిన ఆలయాలు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ఆలయం కనీసం 15 ఏండ్ల క్రితం నిర్మించబడి ఉండాలనే నిబంధన ఉన్నదని వివరించారు. దరఖాస్తులను సంబంధిత పాతజిల్లా పరిధిలోని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వెబ్సైట్ www.endowments.ts.nic.inను చూడాలని సూచించారు.