ఎలాంటి దరఖాస్తు, దస్కత్ లేకుండానే కేసీఆర్ హయాంలో రైతులకు రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అందింది. రైతులు దరఖాస్తులు, దస్కత్ల పేరుతో ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగొద్దని, వారిని ఇబ్బంది పెట్టొద్దన్న సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసింది.
ఇలా ఆరేండ్లు పదకొండు విడతలుగా రైతుల నుంచి ఒక్క దరఖాస్తు కూడా తీసుకోకుండా, పైరవీలు, కమీషన్లకు తావు ఇవ్వకుండా రూ.73 వేల కోట్ల రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించారు.
కానీ, ‘మార్పు.. మార్పు’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలని భావిస్తున్నది. ఇకపై రైతుభరోసా రావాలంటే రైతులు దరఖాస్తు చేయాల్సిందే. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే.
Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా అమలులో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇకపై రైతుభరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచీ సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ) తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రతి సీజన్లో ఎన్ని ఎకరాల్లో, ఏయే పంటలు సాగు చేశారనే వివరాలను ఆయా రైతుల నుంచే తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రతి రైతు నుంచీ రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తు స్వీకరించే అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనకు కమిటీలోని మంత్రులంతా సుముఖత వ్యక్తంచేసినట్టు సమాచారం. ఈ నెల 4న జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
పంట వేసిన భూములకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం అందుకు దరఖాస్తు విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దరఖాస్తు చేసుకున్న రైతులకే రైతు భరోసా మంజూరు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. దరఖాస్తు విధానాన్ని అమలు చేస్తే పెద్ద రైతులు, ఇతర ప్రాంతాల్లో ఉండే రైతులు దరఖాస్తుకు వెనుకంజ వేస్తారని, ఆ మేరకు రైతుభరోసా ఖర్చు మిగులుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అయితే, దరఖాస్తు విధానంతో నిజమైన సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సీజన్లో వానకాలం, యాసంగికి రెండుసార్లు దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రైతులు వ్యవసాయ పనులను పక్కనపెట్టి రోజుల తరబడి దరఖాస్తుల కోసం పంచాయతీ ఆఫీసు చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పైరవీలు, కమీషన్లకు తెరలేస్తుందనే అభిప్రాయాలున్నాయి.
రైతుల చేతిని రైతుల నెత్తిపైనే పెట్టే ఎత్తుగడకు సర్కారు తెరతీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుభరోసా కోసం రైతుల నుంచి డిక్లరేషన్, దరఖాస్తు తీసుకోవాలనే ఆలోచన వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఇచ్చే డిక్లరేషన్లో సదరు రైతుకు మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? వంటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఒకవేళ రైతులు కాస్త అటో ఇటో వివరాలను తప్పుగా నమోదు చేస్తే అందుకు పూర్తిగా రైతులను బాధ్యులను చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. కొందరు రైతులు పంట వేయడం ఆలస్యమైతే.. ఆ పంటను డిక్లరేషన్లో నమోదు చేయాలని భావిస్తారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ పంట వేయడం మానేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంతో ఆయా రైతులపై చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. దీంతోపాటు తీసుకున్న రైతుభరోసా డబ్బులను తిరిగి వసూలు చేసే విధంగా చర్యలు తీసుకొనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.