హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రీజియన్ల పరిధిలోని నాన్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 150 ఖాళీల భర్తీ కోసం ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 16లోగా దరఖాస్తులను స్వీకరిస్తారు.
దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎ స్సీ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీలో 2018 -2023 సంవత్సరాల మధ్య ఉత్తీర్ణులై, 21 నుంచి 35 ఏండ్ల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. శిక్షణ వ్యవధి మూడేండ్లు ఉంటుంది. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదటి, రెండు, మూడేండ్లకుగాను వరుసగా నెలకు రూ.15 వేలు, రూ.16 వేలు, రూ.17 వేల చొప్పున ప్రతినెలా ఉపకార వేతనం ఇస్తారు. దరఖాస్తులను www.nats. education. gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.