Ration Cards | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : కొత్తరేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ గడువుపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం కొత్త కార్డులతోపాటు పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారంతా పాత కార్డులో పేరు ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కార్డులో పేరు తొలగిస్తేనే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. లేనిపక్షంలో ఆన్లైన్లో దరఖాస్తును స్వీకరించదు. మార్పులు, చేర్పులకు కూడా ఇదే పద్ధతి వర్తించనున్నది. ఇక ప్రజాపాలనలో, ఇటీవల గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. మీసేవ నిర్వాహకులు మాత్రం మళ్లీ దరఖాస్తు చేసుకుంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.