సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): దివ్య సంతానం కోరుకునే దంపతులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తున్న ఆర్యజనని యువతకు స్కాలర్షిప్స్ అందించేందుకు ముందుకు వచ్చిందని డాక్టర్ అనుపమరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం 18 నుంచి 30 ఏండ్లలోపు యువతకు జాతీయస్థాయి ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనున్నదని పేర్కొన్నారు. వివేకానంద ప్రాక్టికల్ వేదాంత, జ్ఞానయోగా ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకంపై టెస్ట్ ఉంటుందని తెలిపారు. మాక్‌టెస్ట్ జూలై 20న జరగనుండగా, ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఆర్యజనని వెబ్సైట్ https:// aaryajananicontests.org/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. https://aaryajananicontests.org/login/signup.php మెయిన్ క్విజ్ ఆగస్టు మూడున జరగనున్నదని, విజేతలైన 150మందికి స్కాలర్షిప్లు అందిస్తామని తెలిపారు. వివరాలకు 8977863881 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు.
2న అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి : ఏఐవైఎఫ్
హైదరాబాద్,జూన్ 25 (నమస్తే తెలంగాణ): దేశ ప్రయోజనాలు, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర పిలుపునిచ్చారు. వలస భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జూలై 2న అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. వలస భారతీయులపై అమెరికా చర్యలను అడ్డుకోవడంలో మోదీ విఫలం చెందారని ధ్వజమెత్తారు.
నేడు పీజీఈసెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఎంటెక్, ఎంఈ, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్‌కుమార్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణకుమారి తెలిపారు.
138 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు రీ ఓపెన్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలోని 128 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు తిరిగి ప్రారంభమైనట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 1,224 మంది విద్యార్థులు చేరినట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 26, నాగర్‌కర్నూల్‌లో 23, ఖమ్మంలో 15 స్కూళ్లు తిరిగి ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య జీరోకు చేరడంతో మూసివేశారు. తాజాగా విద్యార్థులు చేరడంతో పునఃప్రారంభించారు.