ఊట్కూర్, అక్టోబర్ 27: నకిలీ పత్రాలతో కల్యాణలక్ష్మి నిధులను కాజేసేందుకు యత్నించిన ముగ్గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రమేశ్ కథనం మేరకు.. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన పదమ్మ తన కోడలు సంతోషను కూతురుగా పేర్కొంటూ నకిలీ పెండ్లి కార్డుతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసింది. అదే విధంగా చాలా ఏండ్ల కిందట పెండ్లి జరిగిన తన కూతురు శారదకు సైతం ఇటీవల పెళ్లి జరిగినట్టు దరఖాస్తు చేసింది.
మరో మహిళ దేవమ్మ కొన్నేండ్ల కిందట తన కూతురు నందినికి పెండ్లి జరిపించి అప్పట్లోనే కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధిపొందింది. తిరిగి కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసింది. తిమ్మక్క కోడలు లింగమ్మను కూతురిగా సృష్టించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసింది. ఈ నెల 22న మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకాగా ఆర్ఐ వెంకటేశ్‌కు అనుమానం వచ్చి గ్రామంలో విచారణ చేపట్టారు. దరఖాస్తు పత్రాలు నకిలీవని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.