హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): స్టేట్ క్యాడర్‌గా తమను పరిగణించి బదిలీల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ ప్రిన్సిపాళ్లు తమ సొసైటీ కార్యదర్శిని కోరారు. 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా తాము మైనార్టీ గురుకులాల్లో ప్రిన్సిపాళ్లుగా నియమితులమయ్యామని, ఆ తర్వాత కొన్ని రోజులకే తమ సొసైటీ పాఠశాలలన్నింటినీ కళాశాలలుగా మార్చడంతో వాటి ప్రిన్సిపాళ్లుగా తమను అప్‌గ్రేడ్ చేశారని సోమవారం ఓ ప్రకటనలో వివరించారు. నాటి నుంచి నేటి వరకు తమకు గ్రేడ్-1 స్కేలునే చెల్లిస్తున్నారని, ఈ ఏడాది మే వరకు ఇంక్రిమెంట్లను కూడా గ్రేడ్-1 స్కేల్ ప్రకారమే ఇచ్చారని తెలిపారు. గతంలో లోకల్ క్యాడర్‌గా ఉన్న తమను స్టేట్ క్యాడర్‌గా పూర్వపు సొసైటీ కార్యదర్శి పరిగణించడంతోపాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సీనియార్టీ జాబితాను కూడా ఆ విధంగానే రూపొందించారని పేర్కొన్నారు. కానీ, గత నిర్ణయాలను, ఆదేశాలను ప్రస్తుత సెక్రటరీ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.