హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పది నెలలుగా గిరాకి లేకపోవడంతో ‘చేనేత చేయూత’ పథకం కింద ఆర్డీ-1 అకౌంట్లో నెల వారీగా డబ్బులు జమ చేయలేక పోయామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది చేనేత కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంఘం నాయకులు తెలిపారు. ఆర్డీ-1 అకౌంట్లో జమ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఆర్డీ-2 అకౌంట్ నుంచి డబుల్ అమౌంట్ జోడించి, తిరిగి కార్మికులకు చెల్లించడానికి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు స్వామి హ్యాడ్లూమ్, టెక్స్టైల్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేయనున్నట్టు చెప్పారు.