పటాన్చెరు రూరల్, మే 15 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అన్ని వడపోతల తరువాత 67 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 13 మంది ప్రస్తుతం ఇంటి పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం.. బేస్మెంట్ లెవల్ పూర్తి చేసినవారికి రూ.1లక్ష అందజేయాలి. నిబంధనల మేరకు పిల్లర్లు పూర్తి చేసుకుంటే మరో రూ.లక్ష చెల్లించాలి. కానీ, ఇప్పటివరకూ బిల్లు మంజూరు కాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మార్చి 15న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి రామేశ్వరంబండ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆకస్మికంగా వచ్చి పరిశీలించారు.
లబ్ధిదారులు కడుతున్న ఇండ్లను చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూ, పునాది దశకు చేరిన లబ్ధ్దిదారులతో మాట్లాడారు. త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని, సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. కానీ, ప్రస్తుతం పునాది దశ పూర్తి చేసుకుని, స్లాబ్‌లు వేయడానికి సిద్ధమవుతున్నవారికి సైతం ఇంతవరకు రూపాయి ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల గ్రామంలో ముగ్గురికి మాత్రమే మొదటి విడత బిల్లులు చెల్లించారు. మరికొందరి పేర్లను యాప్ స్వీకరించడం లేదు. ఇది టెక్నికల్ సమస్య అని అధికారులు చెప్తుండగా, తమ బిల్లులే ఎందుకు రావడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
యాప్‌లో అప్లోడ్ సమస్య ఏర్పడటంతో కొందరి పేర్లు నమోదు కావడం లేదు. రామేశ్వరంబండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ముగ్గు వేసిన దశ నుంచీ పర్యవేక్షిస్తున్నారు. మన్నె మల్లేశ్‌కు సంబంధించిన ఇంటి నిర్మాణం బిల్లు యాప్ స్వీకరించక ఆగింది. హౌజింగ్ విభాగం ఏఈ, డీఈలకు సమస్యను వివరించాం. టెక్నికల్ టీం ఈ సమస్యను పరిష్కరిస్తే తక్షణమే బిల్లులు చెల్లిస్తాం. గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు ఈ మధ్యే బిల్లులు చెల్లించాం. – యాదగిరి, ఎంపీడీవో, పటాన్చెరు