Banakacherla | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో భేటీకి సన్నాహాలు చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసింది. దాదాపు రూ.80 వేల కోట్లతో రూపొందించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు పనులకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు నిధులను సమకూర్చేందుకు సుముఖత వ్యక్తంచేసింది. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర భంగం వాటిల్లనున్నది. వాటా తేల్చకుండా నీళ్ల తరలింపు తగదని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.
చట్టపరంగా అడ్డుకుంటామని స్పష్టంచేసింది. ప్రాజెక్టుపై ఇరు రాష్ర్టాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పందించారు. త్వరలోనే ఇరు రాష్ర్టాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆ దిశగా కేంద్ర జల్‌శక్తి శాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.
అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం 2016లో, రెండో సమావేశం 2020లో నిర్వహించారు. ఏపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆవులపల్లి రిజయర్వాయర్, జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర ప్రాజెక్టుల విస్తరణను చేపట్టింది. వాటిని ఆక్షేపిస్తూ తెలంగాణ అనేక ఫిర్యాదులు చేసినా స్పందించని, అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఊసెత్తని కేంద్రం ఇప్పుడు ఏపీ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు కోసం సిద్ధమవుతుండటం గమనార్హం.