HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్గా షెటర్లు నిర్మించి, వ్యాపారాలు చేస్తూ నివాసితులకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న ఫిర్యాదుపై హైడ్రా ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.
అల్కాపూర్ టౌన్షిప్లోని అనుహార్ మార్నింగ్ రాగా అపార్ట్మెంట్స్లో 14 షెట్టర్లను రేగింది. హైడ్రా, మున్సిపల్, పోలీసు సిబ్బందిని అపార్ట్మెంట్లోని పలువురు నిలువరించే ప్రయత్నం చే శారు. వారి అభ్యర్థనలను లెక్కచేయని అధికారులు పోలీసుల సహకారంతో రెండు జేసీబీలతో షట్టర్లను ధ్వంసం చేశారు. దీంతో మున్సిపల్, హైడ్రా అ ధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎవరో ఇచ్చిన ఫి ర్యాదుపై హైడ్రా ఎలా స్పందిస్తుందని, అన్నిచోట్లా ఇలాగే కూల్చేస్తారా అని వ్యాపారులు ప్రశ్నించారు.
మరోవైపు తాము చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్కాపూర్లో మార్నింగ్ రాగాకు చెందిన 16 ఫ్లాట్ల యజమానులు తమకు ఫిర్యాదు చేశారని, దీనిపై క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేశామని పేర్కొన్నారు. ఇరుపక్షాలను హైడ్రా కార్యాలయంలో సమావేశపరిచి పత్రాలను పరిశీలించి కమర్షియల్ నిర్మాణాలను తొలగించాలని సూచించామని చెప్పారు.