Telangana | (గుండాల కృష్ణ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ పూర్తిగా నిండిన ప్రతి ఏడాది తెలంగాణలోని ఎడమ కాల్వ కింద వానకాలంతో పాటు యాసంగి పంటలకు పుష్కలమైన సాగునీరు అందుతుంది. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటికీ ఎలాంటి ఢోకా ఉండేది కాదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సాగర్ జలాశయం ఎండిపోయే దుస్థితి ఎందుకు వచ్చింది? ఎడమ కాల్వతో పాటు ఏఎమ్మార్ ప్రాజెక్టు కింద సుమారు 9 లక్షల ఎకరాల్లోని యాసంగి పంటలకు డిసెంబరు 15, 2024 నుంచి ఫిబ్రవరి-23, 2025 వరకు సాగునీరు అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలతో సహా అధికారికంగా పత్రికల్లో షెడ్యూలు విడుదల చేసింది. అంటే లక్షలాది మంది రైతులకు సాగునీటి భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఇచ్చింది. మరిప్పుడు నాగార్జునసాగర్ నుంచి చివరి భూములదాకా యాసంగికి నీళ్లిచ్చే పరిస్థితి ఉన్నదా? సాగర్‌లో ఆ మేర నీటి నిల్వ ఉన్నదా? రైతులకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం సాగర్ ఖాళీ అవుతుంటే మూణ్నెళుగా ఎందుకు మొద్దునిద్ర పోయింది? శ్రీశైలం, సాగర్ నుంచి ఏక్షణం ఎన్ని క్యూసెక్కులు తరలిపోతున్నాయనే వివరాలు ఇప్పుడు సామాన్యుడు సైతం ఆన్లైన్లో తెలుసుకునే సాంకేతిక వెసులుబాటు ఉన్నది.
అలాంటిది ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ కోటా నీటిని సైతం సాగర్ నుంచి మళ్లించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలవకుండా ఉండదు. అయినా సాగర్ 540 అడుగుల కంటే తక్కువ నీటిమట్టానికి పడిపోయి, సర్కారు నిర్లక్ష్యాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశించిన తర్వాత గానీ ప్రభుత్వం హైడ్రామాను మొదలుపెట్టలేదు. ‘ఏపీ జలదోపిడీని అడ్డుకోండి’ అని సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖను ఆదేశించడం.. అదేరోజు జలమండలి, మేఘా ఇన్ఫ్రా అధికారులు సుంకిశాలను సందర్శించి పునరుద్ధరణ పనులు మొదలుపెట్టడం వెనువెంటనే జరిగిపోయాయి. నిరుడు జూలై 18 నుంచి ఇప్పటివరకు అంటే 219 రోజులుగా క్షణం కూడా ఆగకుండా సాగర్ కుడి కాల్వలో కృష్ణమ్మ పరుగుల వెనుక ఏం జరుగుతున్నది? తెలంగాణ రైతాంగానికి హక్కుగా దక్కాల్సిన కృష్ణాజలాలకు గండి కొట్టిన ఏపీ సర్కారు జలచౌర్యంతో కోట్లాది రూపాయల పునరుద్ధరణ భారాన్ని తప్పించుకొని ఒడ్డున పడింది ఎవరు? స్వామికార్యం.. స్వకార్యం.. నెరవేర్చుకునేందుకు తెలంగాణ రైతులను పణంగా పెట్టింది ఎవరు? ఇన్నాళ్లూ కండ్లు మూసుకొని ఇప్పుడు ఆ నెపాన్ని పాతాళ గంగమ్మపైకి నెట్టి.. భూగర్భజలాలు పడిపోయినందున రైతులు పంటలు వేసుకోకండి, పెట్టుబడి పెట్టకండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం వెనక ఆంతర్యమేమేటి? అనేది తేలాల్సి ఉన్నది.
సాగుకు కష్టమే.. తాగుకు గండమే..
సాగర్‌లో కనీసంగా 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా కొనసాగుతుంది. అంటే ఇక నాగార్జునసాగర్‌లో 510 అడుగుల వరకు వాడుకునేందుకు ఉన్న నీటి లభ్యత దాదాపు 48 టీఎంసీలు. 9 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, మిషన్ భగీరథ తాగునీటి కోసం 116 టీఎంసీలు కావాలని ఈ నెల 6న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ కృష్ణా బోర్డుకు ఇండెంట్ పెట్టారు. ఇక ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు 33.86 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ రెండు ఇండెంట్స్ ద్వారా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కుడి కాల్వ కింద నీటి విడుదల కొనసాగిస్తూనే ఉన్నది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో 4 మోటర్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. వీటి డిజైన్ డిశ్చార్జి 600 క్యూసెక్కులు అంటే 2400 క్యూసెక్కులు విడుదల కావాలి. కానీ సాగర్‌లో 540 అడుగుల కంటే నీటిమట్టం పడిపోగానే డిశ్చార్జి 500 క్యూసెక్కులకు పడిపోయి ఇప్పుడు 2 వేల క్యూసెక్కులే వస్తున్నది. ఎండకాలం మొదలు కాకముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందనేది ఊహించవచ్చు. పుణ్యకాలం కాస్తా దాటిపోయిన తర్వాత ‘జలచౌర్యాన్ని అడ్డుకోండి’ అని సీఎం ఆదేశించడం, మా రైతులు ఇబ్బందులు పడకుండా సహకరించండి అంటూ కృష్ణా బోర్డు చైర్మన్‌ను మంత్రి ఉత్తమ్ కోరడం వల్ల కుడికాల్వ పారుదల ఆగుతుందా? 9 లక్షల ఎకరాల్లో పంటలు వేసుకున్న తెలంగాణ రైతులు గట్టెక్కుతారా?
మొదలైన సుంకిశాల పునరుద్ధరణ పనులు
సాగర్‌లో నీటిమట్టం తగ్గడం ద్వారా సుంకిశాల పంప్‌హౌస్‌లో మధ్య సొరంగం తేలడంతో పనుల పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. 540 అడుగులకంటే తక్కువ నీటిమట్టం పడిపోయిన రోజే జలమండలి, మేఘా ఇన్ఫ్రా అధికారులు సుంకిశాలను సందర్శించారు. ఘటన జరిగిన క్షణం నుంచి సాగర్‌లో 540 అడుగుల నీటిమట్టం వరకు సుంకిశాల పంస్హౌస్లోని మధ్య సొరంగం ద్వారా కృష్ణాజలాల ప్రవాహం ఉండేది. నీటిమట్టం తగ్గిన వెంటనే ప్రవాహం నిలిచిపోయి, పంప్‌హౌస్‌లో కూడా నీటిమట్టం తగ్గిపోయి ఎగువ సొరంగం తేలిపోయింది. (బయటకు కనిపిస్తుంది) దీంతో సాగర్ జలాశయం ఫోర్‌షోర్‌లో సుంకిశాల సొరంగాన్ని భారీ ఎత్తున మట్టి, రాళ్లు పోసి మూసివేశారు. ఇక పంప్‌హౌస్‌లో ఉన్న నీటిని తోడి పోయాల్సి (డీవాటరింగ్) ఉంది. అందులో ఇప్పటికీ కొన్ని యంత్రాలు, భారీ క్రేన్, కాంక్రీట్ శిథిలాలు ఉన్నాయి. వాటిని తొలగించిన తర్వాత కాంక్రీట్ పనులు మొదలుపెట్టేందుకు అవకాశమున్నదని అధికారి ఒకరు తెలిపారు.
గతంలో ఎన్నడూలేని విధంగా సాగర్ ఖాళీ
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు జీవం పోయడంతో పాటు కోట్లాది మంది గొంతు తడిపే సాగర్‌కు నిరుడు భారీ వరదలొచ్చాయి. ఏకంగా 850 టీఎంసీల కృష్ణాజలాలు సముద్రంలో కలిశాయి. కానీ ఎండకాలం మొదలు కాకముందే వట్టిపోయే పరిస్థితి వచ్చింది. నిరుడు డిసెంబర్ 1వ తేదీన నిండుకుండలా ఉన్న నాగార్జునసాగర్ నుంచి గురువారం నాటి వరకు ఏకంగా 126.81 టీఎంసీలు తోడారు. అంటే రోజుకు 1.546 టీఎంసీలు రెండు రాష్ర్టాలు తీసుకున్నాయి. ఈ క్రమంలో రెండు రాష్ర్టాల వినియోగం పరిశీలిస్తే ఆంధప్రదేశ్ వినియోగం ఏకంగా 78 శాతం వరకు ఉంటే తెలంగాణ వినియోగం 22 శాతం దాటడం లేదు. ఏకపక్షంగా ఏపీ తోడుకుపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోవడం ఒక వంతైతే, 9 లక్షల ఎకరాలకు ఏప్రిల్ 25 వరకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా నీటి విడుదలను ఎందుకు నియంత్రించలేదనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలోనూ భారీ వరదలు వచ్చిన సంవత్సరాలను పరిశీలిస్తే ప్రస్తుతానికి గతానికి చాలా భిన్నంగా నీటి విడుదల ఉండటం అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
సాగర్ ఖాళీ కావడమే సుంకిశాలకు వరమా?
వాస్తవానికి నిరుడు కృష్ణా బేసిన్లో వచ్చిన భారీ వరదతో సుంకిశాల పునరుద్ధరణ పనులు ఏప్రిల్-మే నెలలోగానీ మొదలయ్యే అవకాశాలులేవని సాగునీటి రంగ నిపుణులు, అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సాగర్‌లో నీటిమట్టం ఎక్కువ ఉన్న సమయంలోనూ పంప్‌హౌస్‌లోకి నీళ్లు రాకుండా సొరంగాన్ని మూసివేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కోసం మేఘా ఇన్ఫ్రా ప్రయత్నాలు చేసింది. నిపుణులను రప్పించి, సాంకేతిక సంప్రదింపులు చేసింది. అయితే నీటిమట్టం ఎక్కువ ఉన్న సమయంలో సొరంగాన్ని మూసివేయాలంలే అందుకు భారీగా ఖర్చవుతుందని తెలిసింది. అందుకే నీటిమట్టం తగ్గే వరకు వేచి చూసి ఇప్పుడు 540 అడుగుల కంటే తక్కువ నీటిమట్టం రాగానే పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. హైదరాబాద్ మహానగర తాగునీటి కోసం సుంకిశాల పనుల పునరుద్ధరణ అనివార్యమే. కాకపోతే ప్రభుత్వం దీనిపై ముందస్తు ప్రణాళిక ప్రకటించి ఉంటే 9 లక్షల ఎకరాల ఆయకట్టులోని పంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారేదికాదనేది అక్షర సత్యం.
కిందికి పోయేకొద్దీ ఇంకా దయనీయం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ ఎఫ్ఆర్ఎల్ 590 అడుగులు. ఎండీడీఎల్ 510 అడుగులు. (అత్యవసరమైతే తప్ప అంతకు కిందికి నీటిని విడుదల చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ జీవోలు ఉన్నాయి) ఎడమ కాల్వ గేట్లు స్పిల్‌వే కంటే 25 అడుగుల ఎత్తు ఉన్న దరిమిలా సాగర్‌లో 514 అడుగులకంటే ఎక్కువ నీటిమట్టం ఉంటేనే పూర్తిస్థాయి నీటి విడుదల ఉంటుంది. కానీ కుడి కాల్వ గేట్ల ఎత్తు 15 అడుగులు ఉన్నందున సాగర్‌లో 504 అడుగుల నీటిమట్టం ఉన్నా పూర్తిస్థాయిలో (డిజైన్ డిశ్చార్జి) ఉంటుంది. పైగా గేట్లు, కాల్వల వెడల్పు కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు సాగర్ రిజర్వాయర్‌లో 510 అడుగుల మేర నీటిమట్టం ఉన్నపుడు ఎడమ కాల్వ గేట్లు అన్నీ పూర్తిగా ఎత్తినా 6,018 క్యూసెక్కుల నీళ్లు వస్తాయి. అదే కుడి కాల్వ నుంచి 24,840 క్యూసెక్కుల నీళ్లు వెళ్తాయి. 504 అడుగుల నీటిమట్టం ఉన్నపుడు గేట్లు పూర్తిగా తెరిస్తే ఎడమ కాల్వ నుంచి కేవలం 3,625 క్యూసెక్కులు వెళ్తే, కుడి కాల్వ ద్వారా 11,420 క్యూసెక్కుల నీళ్లు వెళ్తాయి. అంటే సాగర్‌లో నీటిమట్టం పడిపోయేకొద్దీ తెలంగాణ అవకాశాలు సన్నగిల్లుతాయి.
అయ్యో.. అడుగంటిన సాగరం
ఈ ఫొటో చూశారా?! ఎండకాలం మొదలవకముందే అడుగంటిన నాగార్జునసాగర్ ప్రస్తుత దుస్థితి ఇది. నిరుడు భారీ వర్షాలు పడి నిండుకుండలా మారినా చివరికి సముద్రంలో 850 టీఎంసీలకు పైగా కలిశాయి. ఇప్పుడు నీటిమట్టం 535.60 అడుగులకు పడిపోయింది. గత రికార్డులను పరిశీలిస్తే సాగర్‌లో మే నెలలో తప్ప ఇంత తక్కువ మట్టానికి పడిపోయిన దాఖలాల్లేవు. సాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్ ప్రాజెక్టు కింద ఏకంగా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు కావాలి. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు ఆగస్టు వరకు తాగునీరు అందాలి. సాగర్‌లో 510 అడుగుల కంటే పైన ఉన్న నీటి నిల్వ కేవలం 48 టీఎంసీలే. మరి తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు ఎలా తీరుతాయి?
అదిగో.. నీటముంచిన నిర్లక్ష్యం
ఇది సాగర్ ఫోర్‌షోర్‌లో నిర్మించిన సుంకిశాల మంచినీటి పథకం పంప్‌హౌస్. నిరుడు ఆగస్టు 1న ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టు సంస్థ మేఘా నిర్లక్ష్యం కారణంగా ఇక్కడే మధ్య సొరంగానికి అడ్డుగా కట్టిన రిటెయినింగ్ వాల్ కుప్పకూలి పంప్‌హౌస్ మునిగింది. 540 అడుగుల నీటిమట్టం స్థాయిలో ఉన్న మధ్య సొరంగం ద్వారా జలాలు ఇందులోకి వస్తుండటంతో సుంకిశాల పనులు నిలిచిపోయాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరణ కోసం నిపుణులతో మేఘా సంప్రదింపులు చేసింది. కానీ అందుకు కోట్లాది రూపాయలు ఖర్చవుతుందని తెలిసింది. రెండు నెలల్లో పునరుద్ధరిస్తామని ప్రకటించినా నీటిమట్టం ఎక్కువ ఉండటంతో పనులు మొదలుపెట్టలేదు.
ఇదిగో.. తేలిన సొరంగం
సాగర్‌కు నిరుడు భారీ వరదలు వచ్చినందున ఏప్రిల్-మే వరకు సుంకిశాల సొరంగాలు పైకి తేలే అవకాశాలు లేవని నిపుణులు అంచనా వేశారు. కానీ ఏపీ తన కోటాతో పాటు తెలంగాణ కోటాను కూడా తన్నుకుపోవడంతో సాగర్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఫిబ్రవరి రెండో వారంలోనే నీటిమట్టం 540 అడుగుల కిందికి పడిపోయింది. దీంతో 540 అడుగుల స్థాయిలో ఉన్న సుంకిశాల సొరంగం ద్వారా జలాలు పంప్‌హౌస్‌లోకి రావడం నిలిచిపోయాయి. ఫలితంగా ఇప్పుడు ఎగువ సొరంగం పైకి తేలి కనిపిస్తున్నది. సుంకిశాల ఘటన తర్వాత అటువైపు చూడని అధికారులు 540 అడుగుల కంటే తక్కువ నీటిమట్టానికి చేరుకున్న గత మంగళవారమే ఇక్కడికి వచ్చి పరిశీలించి పునరుద్ధరణ మొదలుపెట్టారు.