హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగులకు సంబంధించిన రూ.1730 కోట్లను ఏపీ ట్రాన్స్ కో చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రెండు పద్దుల కింద రావాల్సిన ఆ మొత్తం ఏపీ ట్రాన్స్‌కో చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలన్న రిట్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ నవీన్‌రావు, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ ట్రాన్స్‌కో, పెన్షన్ అండ్ గ్రాట్యూటీ పీఎఫ్ ట్రస్ట్, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఇదే తరహాలో ఏపీ బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ దాఖలు చేసిన గతంలోని రిట్ పిటిషన్లతో కలిపి విచారిస్తామని ప్రకటించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసింది. ఉద్యోగుల ట్రస్ట్‌లో పెట్టుబడులు, పంపిణీ, ఎస్ఎల్సీ చార్జీలు, టీఎస్ డిసం బాండ్లు, ఇతరత్రా రిజర్వు నిధులు మొత్తం రూ.1267 కోట్లు, ఆ నిధుల బకాయిలపై వడ్డీ రూ.463 కోట్లు కలిపి రూ.1730 కోట్లు ఏపీ ట్రాన్స్ కో చెల్లించాలని తెలంగాణ ట్రాన్స్‌కో, దాని ట్రస్ట్ సీఎండీ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ట్రాన్స్‌కో తరఫు న్యాయవాది వై రామారావు వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విద్యుత్తు బకాయిలను ఏపీ ట్రాన్స్‌కో చెల్లించలేదని తెలిపారు.
ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్తు ఉద్యోగుల పంపిణీ దాదాపు పూర్తి అయ్యిందని, కేవలం 35 మందిని వర్గీకరించాల్సి ఉన్నదని వివరించారు. కాబట్టి తెలంగాణ ఉద్యోగుల ట్రస్ట్‌లకు చెందిన నిధులను ఏపీ ట్రస్టులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ, ఏపీల విభజన తర్వాత ఉద్యోగుల డబ్బు ఏపీ ట్రస్టుల దగ్గరే ఉన్నదని, అయినప్పటికీ పదవీ విరమణ సమయంలో ఆర్థిక ప్రయోజనాల సొమ్మును తెలంగాణ ట్రాన్స్కోనే చెల్లించిందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ట్రాన్స్‌కోలు 2014లో బాండ్లు జారీ చేశాయని, షీలా బిడే కమిటీ నిబంధనల ప్రకారం రూ.359.50 కోట్లు ఏపీ ట్రాన్స్‌కో నుంచి రావాల్సి ఉన్నదని అన్నారు. వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.612 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏపీ ట్రాన్స్ కో నుంచి తెలంగాణ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎల్, గ్రాట్యూటీ మొదలైన వాటి నిమిత్తం రూ.712 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని తెలిపారు. అదే సమయంలో ఎస్ఎల్డీసీ చార్జీలు రూ.190 కోట్లను చెల్లించేస్తామని 2019లో ఏపీ ఒప్పుకొన్నప్పటికీ చెల్లింపులు జరపలేదని తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ.1730 కోట్లు తమకు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం -2014లోని సెక్షన్ 66 ప్రకారం రాష్ట్రాల మధ్య ఆస్తులు, ఇతర ప్రయోజనాల సమస్యలను కేంద్ర ప్రభుత్వం మూడేండ్లలోగా పరిషరించాల్సి ఉందని, తమ సమస్య ఇప్పటికీ కొలికి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని రామారావు వివరించారు. వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
బకాయిల వివరాలు
ఉద్యోగుల ట్రస్టు (పీఅండ్ జీ, పీఎఫ్, ఈఎల్, గ్రాట్యుటీ) బకాయి రూ.674 కోట్లు, వడ్డీ రూ.38 కోట్లు
ట్రాన్స్మిషన్ అండ్ ఎస్ఎల్డీసీ చార్జీలు అసలు రూ.105 కోట్లు, వడ్డీ 85 కోట్లు
టీఎస్ డిసమ్ బాండ్స్ అసలు రూ.359 కోట్లు, వడ్డీ రూ.253 కోట్లు
ఐసీడీఎస్, డెబిట్ సర్వీసింగ్ మొదలైనవి అసలు రూ.128 కోట్లు, వడ్డీ 87 కోట్లు
ఏటీ ట్రాన్స్ కో మొత్తం బకాయి: అసలు రూ.1267 కోట్లు, వడ్డీ రూ.463 కోట్లు