కూసుమంచి (నేలకొండపల్లి), డిసెంబర్ 1: తెలంగాణలో క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌ను ఇక్కడి ప్రభుత్వం ఇస్తుండటంతో దానిపై కన్నేసిన ఆంధ్రా వ్యాపారులు లారీల కొద్దీ ధాన్యాన్ని నిరుడు తెలంగాణలోకి అక్రమంగా పంపి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో కొన్ని లారీలను స్థానిక రైతులు పట్టుకున్నప్పటికీ ఆంధ్రా వ్యాపారులు మాత్రం ఎక్కువ సంఖ్యలో లారీలను తెలంగాణలోని మిల్లులకు చేర్చి లబ్ధిపొందిన సంగతి తెలిసిందే. ఆంధ్రా వ్యాపారులు ఈ ఏడాది కూడా అదే అక్రమానికి తెరతీశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారంలో సోమవారం కొందరు రైతులు ఈ లారీలను పట్టుకోవడంతో ఈ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో క్వింటా ధాన్యానికి రూ.500 చొప్పున ఇచ్చే బోనస్ కొట్టేయడానికి ఆంధ్రా ధాన్యం వ్యాపారులు కుట్రపన్నారు. నిరుడు ఒక్కో లారీలో సుమారు 400 క్వింటాళ్ల ధాన్యాన్ని తెలంగాణలోకి పంపారు. క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున ఒక్కో లారీ ద్వారా 400 క్వింటాళ్లను తెచ్చి రూ.2 లక్షల వరకు తెలంగాణ బోనస్ సొమ్మును అక్రమంగా పొందారు.
ఇలా వందలాది లారీలతో అక్రమార్జనకు పాల్పడ్డారు. నిరుడు ఇదే నెల 13 నుంచి 16వ తేదీల మధ్య తెలంగాణలోని ఖమ్మం మీదుగా సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడలోని రైస్ మిల్లులకు తరలించి లబ్ధిపొందారు. తెలంగాణలోని కొందరు మిల్లర్లు, పలువురు అధికారులతో చేతులు కలిపి ఆంధ్రా ధాన్యాన్ని తెలంగాణలో విక్రయించి అక్రమంగా బోనస్ కొట్టేశారు. అప్పట్లో ఏపీ సరిహద్దుగా ఉండే ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, నేలకొండపల్లి మండలాల మీదుగా చెక్‌పోస్టులను దాటుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైస్ మిల్లులకు, ఐకేపీ కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్న వందలాది లారీలను ముదిగొండ, నేలకొండపల్లి మండలాల రైతులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. సదరు లారీలను తిప్పి పంపారే తప్ప చర్యలు తీసుకోలేదు. తరువాత కూడా ఆయా లారీలు మళ్లీ అడ్డదారుల్లో తెలంగాణలోకి ప్రవేశించాయి. వాటిలోని ధాన్యాన్ని ఏపీ వ్యాపారులు తెలంగాణలో విక్రయించి బోనస్‌ను సొమ్ము చేసుకున్నారు.
తెలంగాణలో రైతులకు సమయానికి బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతున్నది. కానీ ఆంధ్రా నుంచి ధాన్యాన్ని తెచ్చి ఇక్కడి రైతుల పేరుతో విక్రయించిన ఏపీ వ్యాపారులకు బోనస్ ఎలా చెల్లిస్తున్నదని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా ధాన్యం వ్యాపారులతో తెలంగాణ మిల్లర్లు, అధికారులు చేతులు కలపడం వల్లే ఇది సాధ్యమైందని ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని రవాణా శాఖ చెక్‌పోస్టులను ప్రభుత్వం ఎత్తివేయడం, వ్యవసాయ మార్కెట్ కమిటీల చెక్‌పోస్టులు ఉనికిలో లేకపోవడం, ఏపీ పర్మిట్ లారీలు తెలంగాణలోకి ప్రవేశించినా అడ్డుకునే వ్యవస్థ లేకపోవడం వంటి కారణాలతో ఆంధ్రా లారీలు ధాన్యం లోడుతో తెలంగాణలోకి ప్రవేశించడం సులభమైంది.
ఆంధ్రా నుంచి ధాన్యం లోడుతో వచ్చిన ఎనిమిది లారీలను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం రైతులు సోమవారం పట్టుకోవడంతో ఈ ఏడాది కూడా ఈ దందా కొనసాగుతున్నదనే విషయం వెలుగులోకి వచ్చింది. నిరుటి మాదిరిగానే ఇటీవల కొన్ని రోజులుగా వందలాది లారీలు ధాన్యం లోడుతో కట్టుకాసారం మీదుగా రాకపోకలు సాగిస్తున్న విషయాన్ని గమనించారు. ఇటు పోలీసులకు అటు సివిల్ సప్లయీస్ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. పెద్దగా ఫలితం లేకపోవడంతో సోమవారం కట్టుకాసారం రైతులే ఆంధ్రా లారీలను అడ్డగించి డ్రైవర్లను ప్రశ్నించారు. దీంతో డ్రైవర్లు సమాధానం కూడా చెప్పకుండా లారీలను అక్కడే వదిలి వెళ్లిపోయారు.
ఏపీ నుంచి తెలంగాణకు ధాన్యం తరలిస్తున్న లారీలను నిరుడు ఖమ్మం రైతులు అడ్డుకోగా.. తాజాగా మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సరిహద్దులు దాటి వస్తున్న వడ్ల లారీలను సోమవారం నేలకొండపల్లి మండలం కట్టుకాసారం వద్ద నిలువరించిన స్థానిక రైతులు