హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట 60 శాతం కేంద్రం నిధులతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం దీనిపై ఎందుకు స్పందించడం లేదు..? చంద్రబాబు, రేవంత్‌రెడ్డికి మధ్య ఉన్న లాలూచీ ఏమిటి? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. నదీజలాల వాటా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టకు సంబంధించి కేంద్రానికి పీఎఫ్ఆర్ను ఏపీ సీఎం చంద్రబాబు సమర్పించినా, రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం చాలా దుర్మార్గమని నిప్పులు చెరిగారు.
గోదావరి జిల్లాలను బనకచర్ల ప్రాజెక్టు పేరుతో నీటిని తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారో చెప్పాలని నిలదీశారు. గోదావరి జిలాలపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నదిలో వృథా అవుతున్న నీటిని ఇక్కడి పంట పొలాలకు మళ్లించాలన్నది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆలోచన అని, అందుకే తుపాకులగూడెం వద్ద నుంచి గోదావరి, కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఆనాడే కేసీఆర్ వాదించినట్టు తెలిపారు. దీని వల్ల తెలంగాణలో సగం జిల్లాలకు గోదావరి నీరు పుష్కలంగా లభించే అవకాశం ఉంటుందని, పోలవరం నుంచి లింకేజీ ప్రతిపాదనను గతంలోనే జగన్ తీసుకొస్తే కేసీఆర్ వ్యతిరేకించారని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గుర్తుచేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే.. వందలాది మందితో నామినేషన్లు వేయిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ప్రతీ వార్డులో, పంచాయతీలలో భారీగా నామినేషన్లు దాఖలు చేయిస్తామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లడంలో అర్ధశతకం పూర్తిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. బీసీ బిల్లుపై ప్రధానితో ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు. బీసీ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ వికసిత్ యాత్ర పేరిట బీజేపీ యాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. బీసీ బిల్లు కోసం జూలై 17న పెద్ద ఎత్తున రైల్‌రోకో కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నేథప్యంలో జూలై 16, 17, 18 తేదీల్లో రైలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర సభ్యుడు గాజర్ల రవి మృతికి సంతాపం వ్యక్తంచేశారు.