హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ జలసౌధ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే కార్యాలయ తరలింపు జాప్యమవుతున్నదని బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 85 (2) ప్రకారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటుచేయాల్సి ఉన్నది.
అయితే రాష్ట్ర ఏర్పాటు తరువాత జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలను ఎర్రమంజిల్ జలసౌధలోనే ఏర్పాటుచేశారు. కేఆర్ఎంబీ కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వమే ఉచిత వసతి సమకూర్చింది. 2018లో ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేఆర్ఎంబీని ఏపీలోని విజయవాడకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని బోర్డును కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశించింది. ఆ తరువాత 2018లో నిర్వహించిన 9వ బోర్డు సమావేశంలో ఈ అంశంపై ఇరు రాష్ర్టాలతో చర్చించారు. ఆ తరువాత 2020లో నిర్వహించిన 11వ బోర్డు సమావేశంలో, అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లోనూ కేఆర్ఎంబీ కార్యాలయ తరలింపుపై చర్చించారు. తెలంగాణ సైతం కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీకి తరలించేందుకు అంగీకరించింది.
ఈ నేపథ్యంలో కార్యాలయ తరలింపునకు అనువైన భవనాన్ని చూపాలని కోరుతూ ఏపీ సర్కారుకు బోర్డు లేఖ రాసింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం కార్యాలయాన్ని విజయవాడలో కాకుండా విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీ సూచించింది. దీంతో తెలంగాణ కల్పించిన విధంగానే ఉచితంగా వసతి కల్పించాలని ఏపీ సర్కారుకు బోర్డు సూచించింది. 2023లో నిర్వహించిన 17వ బోర్డు సమావేశంలో మరోసారి బోర్డు కార్యాలయ తరలింపుపై చర్చించారు. విశాఖపట్టణంలో ప్రభుత్వ భవనం నిర్మాణంలో ఉన్నదని, అందులో 9,200 చదరపు అడుగులను కేటాయిస్తామని, అది సరిపోదంటే భవిష్యత్‌లో ఆఫీస్ స్పేస్‌ను మరింత పెంచుతామని ఏపీ సర్కారు బోర్డుకు తెలిపింది.
విశాఖపట్టణంలోని నార్త్‌కోస్ట్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు కేఆర్ఎంబీ ఆఫీస్‌ను తరలించాలని 2023 డిసెంబర్లో మరోసారి కేంద్ర జల్‌శక్తిశాఖ సైతం ఆదేశించింది. అయితే, కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులకు విశాఖపట్టణానికి మధ్య దూరం 550 కిలోమీటర్లు ఉంటుందని, కార్యాలయాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తే ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతరమవుతుందని ఏపీకి కేఆర్ఎంబీ స్పష్టంచేసింది. అంతేకాదు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరించాల్సి ఉంటుందని కేంద్రానికి సైతం బోర్డు తెలిపింది. పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 85, సబ్ సెక్షన్ (1), (4), (5) ప్రకారం కేఆర్ఎంబీ కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండాల్సి ఉంటుందని వివరించింది.
ఆ చట్టాన్ని సవరిస్తేనే ఏపీకి బోర్డు తరలింపు సాధ్యమవుతుందని కూడా బోర్డు స్పష్టంచేసింది. అటు కేంద్రం, ఇటు ఏపీ సర్కారు ఒకసారి విజయవాడ, మరోసారి విశాఖపట్టణం తరలించాలంటూ ప్రతిపాదనలు చేయడం మూలంగానే కేఆర్ఎంబీ కార్యాలయ తరలింపు జాప్యమవుతూ వస్తున్నది. అయితే ఇటీవల కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ర్టాల సీఎంలు భేటీ అయిన విషయం విదితమే. అయితే, కేఆర్ఎంబీ ఆఫీస్‌ను తరలించేందుకు ఏపీ ఒప్పుకున్నదని, అది తెలంగాణ విజయమని రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం విస్మయం గొలుపుతున్నది. కార్యాలయాన్ని తరలించాలని ఏండ్లుగా పట్టుబడుతున్న ఏపీనే మళ్లీ కొత్తగా అంగీకారం తెలపడమేంటో అంతుపట్టని విషయంగా మారింది. దీనిపై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, బోర్డు అధికారులు నవ్వుకుంటున్నారు.