హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : సముద్రంలో కలిసే వరద జలాలనే మళ్లించుకుంటామని నిన్నటిదాకా బుకాయించింది. మరోసారి మిగులు జలాలను మళ్లిస్తే తప్పేంటని దబాయించింది. కానీ ఇప్పుడు ఏకంగా నికర జలాలకే ఏపీ సర్కార్ సూటి పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ నీటి హక్కులకే ఎసరు పెడుతున్నది. గత కేటాయింపులను పరిగణించవద్దంటూ హూంకరిస్తూ, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పేరిట గూడుపుఠాణి చేస్తున్నది. మళ్లించే జలా ల్లో రైపేరియన్ రాష్ర్టాల వాటాకు గండికొట్టేందుకు ఎత్తులు వేస్తున్నది. ఏపీ వాదనలకు కేంద్ర జలసంఘం వత్తాసు పలుకుతుండగా 65శాతం డిపెండబులిటీ కింద మిగులు ఉం టుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నది.
గోదావరి నుంచి సముద్రంలోకి ఏటా వేలాది టీఎంసీలు తరలిపోతున్నాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టును రెండు దశల్లో చేపడుతామని, తొలుత పోలవరం-నల్లమలసాగర్ లింకును, 2వ దశలో బనకచర్ల లింకును చేపడుతామని ప్రకటించారు. అయితే ఒకసారి వరద జలాలతో చేపడుతామని, మరోసారి మిగుల జలాలతో చేపడతామంటూ సర్కార్ ఇప్పటివరకు బుకాయించింది. 200 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే తప్పేంటని? ఎవరికీ నష్టం ఉండబోదంటూ నమ్మబలికింది. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఏకంగా గోదావరి నికర జలాలకే గురిపెట్టింది. తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలకు సిద్ధమైంది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ మేరకే ఏపీ వాదనలు వినిపించింది. నికర జలాల ఆధారంగానే ప్రాజెక్టును చేపడుతున్నట్టు చెప్పకనే చెబుతూ తెలంగాణ నీటి కోటాకే ఎసరు పెట్టింది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గోదావరి జలాల్లో 1,486 టీఎంసీలను కేటాయించింది. అందులో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలు. అయితే ఆ కేటాయింపులు చెల్లవబోవని, తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను పరిగణించవద్దని తాజా సమావేశంలో తేల్చిచెప్పింది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నీటి వినియోగాలను 575 టీఎంసీలకు ప్రతిపాదనలు పెట్టింది. మొత్తంగా తమకే 775 టీఎంసీలకు పైగా కేటాయించాలని ఏపీ పట్టుబట్టింది. ఆ మేరకు నికర జలాల ఆధారంగానే పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింకు చేపడుతున్నట్టుగా ఏపీ ఆ భేటీలో తేల్చిచెప్పింది.
గోదావరి నుంచి మళ్లించే జలాల్లో బేసిన్ రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటాలను ఎగవేసేందుకు ఏపీ ఎత్తులు వేస్తున్నదని స్పష్టమవుతున్నది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం రాష్ర్టానికి కేటాయించిన నికర జలాలను ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడినుంచి ఎక్కడికైనా మళ్లించుకోవచ్చు. కానీ వరద జలాలను మాత్రం మళ్లించుకునే అవకాశం లేదు. ఎందుకంటే గోదావరిలో మిగులు, వరద జలాలపై బేసిన్‌లోని రాష్ర్టాలన్నింటికీ హక్కు ఉంది. ఒకవేళ ఏదైనా రాష్ట్రం వరద జలాలను మళ్లించాల్సి వస్తే ఆ మేరకు బేసిన్‌లోని రాష్ర్టాలకు నీటి వాటాలను పంచాలి. ఈ మేరకు బచావత్ ట్రిబ్యునల్ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ అవార్డుకు విరుద్ధంగా వరద జలాలనే మళ్లిస్తామంటూ బనకచర్ల/నల్లమలసాగర్‌కు ఏపీ శ్రీకారం చుట్టింది. అయితే ఈ ప్రతిపాదనలపై బేసిన్‌లోని రాష్ర్టాలన్నీ అభ్యంతరం తెలిపాయి. ఏపీ బనకచర్ల లింక్‌తో పాటు మొత్తం 423 టీఎంసీలను మళ్లించేందుకు సిద్ధమైందని, అందులో 112టీఎంసీలు ఇవ్వాల్సిందేనని కర్ణాటక రాష్ట్రం కరాఖండిగా స్పష్టం చేసింది.
కేంద్రం పీబీ లింక్ ప్రాజెక్టుకు అనుమతిస్తే అవార్డు ప్రకారం తమ వాటా వినియోగించుకుంటామని, పొరుగు రాష్ర్టాలతో సంప్రదించాల్సిన పని కూడా లేదని తేల్చిచెప్పింది. ఇక మహారాష్ట్ర సైతం తాము కూడా వరద ఆధారిత ప్రాజెక్టుల డీపీఆర్‌లను పంపుతామని వెల్లడించింది. తెలంగాణ సైతం మళ్లించే జలాల్లో వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నది. అంతేకాదు 75శాతం డిపెండబిలిటీ వద్ద 80టీఎంసీలకు మించి మళ్లింపు జరిగితే జీడబ్ల్యూడీటీ, కేడబ్ల్యూడీటీ అవార్డుల ప్రకారం అన్ని రాష్ర్టాల మధ్య పంచుకోవాల్సి ఉంటుందని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ), ఇతర కేంద్ర సంస్థలు సైతం తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో బనకచర్ల/నల్లమలసాగర్ ద్వారా మళ్లించే 200 టీఎంసీల జలాల్లో బేసిన్ రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వాటాలను ఎగవేసేందుకు తాజాగా ఏపీ కొత్త కుట్రకు తెరతీసింది. అందులో భాగంగా ఏకంగా నికర జలాలకే సూటి పెట్టింది. తెలంగాణ నీటి హక్కులనే వ్యతిరేకిస్తున్నదని స్పష్టంగా తేలిపోతున్నది.
ఏపీ ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ సైతం వంతపాడుతున్నది. 75శాతం డిపెండబిలిటీ కింద గోదావరిలో మిగులే లేదని, 157టీఎంసీల లోటు ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) గతంలోనే స్పష్టం చేసింది. ఇక 75శాతం డిపెండబిలిటీ వద్ద 80 టీఎంసీలకు మించి జలాలను మళ్లిస్తే ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం అన్ని రాష్ర్టాల మధ్య పంచుకోవాల్సి ఉందని కేంద్ర సంస్థలు కుండబద్దలు కొట్టి చెప్పాయి. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ తాజాగా 65శాతం డిపెండబులిటీ కింద జలాలను లెక్కగట్టేందుకు సిద్ధమైందని తెలుస్తున్నది. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల నీటి అవసరాలన్నీ తీరిన తర్వాత కూడా జూలై నుంచి అక్టోబర్ మధ్యలో 790టీఎంసీలు, అదే జూలై-ఆగస్టు, సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో 418టీఎంసీలు అందుబాటులో ఉంటాయని గతంలోనే వివరించింది.
ఆ రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నా ఏపీ మళ్లించేందుకు ప్రతిపాదించిన 200 టీఎంసీలు చాలా తక్కువేనని సన్నాయినొక్కులు నొక్కుతున్న సీడబ్ల్యూసీ.. పోలవరం బనకచర్ల/నల్లమలసాగర్ లింకుకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది. ఇటీవల ఢిల్లీ భేటీలో కేంద్రం సైతం ఇవే వాదనలను వినిపించింది. ఏపీకి వంతపాడుతూ తెలంగాణ ప్రతినిధులనే ప్రశ్నించింది. ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింది రాష్ట్రాలకు నష్టం కానీ, ఏపీ తర్వాత ఏ రాష్ట్రం లేదు కదా? వరద జలాలను వాడుకుంటే తప్పేమిటని, తెలంగాణకు నష్టమేంటని అడగడమే సీడబ్ల్యూసీ పక్షపాత తీరుకు అద్దంపడుతున్నది. ఏపీ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తున్నదని స్పష్టంగా తేలిపోతున్నది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కార్ మాత్రం ఏపీ, కేంద్రంతో చర్చలకు ఉత్సాహం చూపడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.