AP Employees | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): పరాయి ప్రాంతీయుల పెత్తనం నుంచి విముక్తి కోసం నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగితే.. నేటి కాంగ్రెస్ పాలన అదే ఆంధ్రా ప్రాంతీయులను తెచ్చి తెలంగాణ ప్రాంతీయుల నెత్తిన కూర్చోపెడుతున్నది. ఇది వివిధ రంగాల్లో చాపకింద నీరులా పాకుతున్నదని తెలంగాణ వాదులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ఆంధ్రా అధికారులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారన్న ఆధారాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రా మూలాలన్న వారికే ఆయా సంస్థల్లో కీలక పోస్టులిస్తున్నట్టు తెలంగాణ ఇంజినీర్లు గగ్గోలు పెడతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ అండతో ఏపీకి చెందిన వారెందరో తెలంగాణకు వచ్చి తిష్టవేస్తున్నారని ఇక్కడి ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఆంధ్రా ఉద్యోగి అక్రమ డిప్యుటేషన్ వ్యవహారం వెలుగుచూసింది. ఏపీ జెన్కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జేవీ దుర్గారావును దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో డిప్యుటేషన్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీకి చెందిన ఆయనకు మూడేండ్లపాటు దక్షిణ డిస్కంలో డిప్యుటేషన్ కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదలచేసింది. ‘ఇనిషియల్లీ త్రీ ఇయర్స్ ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్’ అంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే తొలుత మూడేండ్లు అవకాశం కల్పించారని, ఆ తర్వాత మళ్లీ పొడిగించే అవకాశం ఉన్నదని తెలంగాణ ఇంజినీర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నది. ఎడాపెడా ఎన్వోసీలు జారీచేస్తున్నది. అధికారుల అనుమతితోనే ఇలా వక్రమార్గంలో ఇంజినీర్లు రంగప్రవేశం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఒక మహిళా అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)ను దక్షిణ తెలంగాణ డిస్కంకు కేటాయించారు. ఇలా అక్రమంగా కేటాయించడం అప్పట్లో వివాదాస్పదమైంది. తాజాగా అంతరాష్ట్ర డిప్యుటేషన్ పేరిట జేవీ దుర్గారావుకు ఎంట్రీనిచ్చారు. వీరి రాకకు దక్షిణ డిస్కం సీఎండీ ఎన్వోసీ జారీచేయడం కూడా గమనార్హం. ఇలా ఎడా పెడా ఎన్వోసీలివ్వడం, ఏపీ అధికారులకు రెడ్‌కార్పెట్ పరుచడాన్ని తెలంగాణ ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
డిప్యుటేషన్ విషయంలో అధికారుల తీరు అత్యంత దారుణంగా ఉన్నది. జనరేషన్ (విద్యుదుత్పత్తి) సంస్థ ఇంజినీర్‌ను విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)కు డిప్యుటేషన్‌పై కేటాయించారు. విద్యుదుత్పత్తి వేరు.. పంపిణీ వేరు. రెండింటికీ అసలు సంబంధమే ఉండదు. అయినా ఎలా అనుమతిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన రాష్ట్రంలోని జెన్కో ఉద్యోగులకే డిస్కంలలో, డిస్కం ఇంజినీర్లను జెన్కోకు డిప్యుటేషన్‌పై కేటాయించడమే లేదు. అలాంటిది పక్క రాష్ట్రంలోని ఇంజినీర్‌ను ఎలా అనుమతిస్తారని ఇక్కడి ఇంజినీర్లు నిలదీస్తున్నారు.
విద్యుత్తు సంస్థల్లో ఏపీ ఉద్యోగుల పెత్తనం, ఆధిపత్యం మరింతగా పెరుగుతున్నది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక విద్యుత్తు సంస్థలను ఆంధ్రా అధికారులతోనే నింపేస్తున్నారు. దీంతో తెలంగాణ ఉద్యోగుల, ఇంజినీర్ల ప్రయోజనాలకు గండికొడుతున్నారు. టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీగా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన అనీలను కాంగ్రెస్ సర్కార్ నియమించింది. అత్యంత కీలకమైన చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ (సీఈఐజీ)గా అదే నెల్లూరు జిల్లాకు చెందిన నందకుమార్‌కు పోస్టింగ్ ఇచ్చింది. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం. విజిలెన్స్, ఏసీబీకి ఆయనపై కొంతమంది ఫిర్యాదులు సైతం చేశారు. టీజీ జెన్కో థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా. హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ కుమార్‌రాజా పచ్చి తెలంగాణ వ్యతిరేకి.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం, విద్యుత్తు ఉద్యోగులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన పరిణామాలు ఆనాడు చోటుచేసుకున్నాయి. దక్షిణ డిస్కంలో డైరెక్టర్ నర్సింహులు ఏపీలోనే పనిచేశారు. మరో డైరెక్టర్ శివాజీ తెలంగాణకు వ్యతిరేకంగా నాడు సీమాంధ్రుల ఉద్యమంలో ప్లకార్డులు పట్టుకు తిరిగారు. గ్రేటర్‌లోని ఫోకల్ పోస్టుల్లోనూ ఆంధ్రా అధికారులే ఉన్నారు. హెచ్ఆర్, పీఅండ్ఎంఎం, మేడ్చల్ జోన్, సెంట్రల్ జోన్ సీఈగా ఆంధ్రా అధికారులే ఉన్నట్టు తెలంగాణ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. కీలకమైన మేడ్చల్ జిల్లాలోని డీఈ, ఏఈ, చందానగర్, చర్లపల్లి ప్రాంత ట్రాన్స్‌కో కీలక అధికారులది రాయలసీమ ప్రాంతమేనని తెలంగాణ ఇంజినీర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.