Krishna River | కొల్లాపూర్, ఫిబ్రవరి 6 : రైతాంగానికి అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖరు నాటికి ఎంజీకేఎల్ఐ కింద సాగైన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్న ది. అంతేకాదు, గత సోమవారం నాటికి శ్రీశైలం నీటిమట్టం 852 అడుగులుగా నమోదవడంతో విద్యుత్తు ఉత్పత్తి కోసం కూడా ఏపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఎంజీకేఎల్ఐ పరిధిలో రెండు సీజన్లలో 4.50 లక్షల ఎకరాలు సాగవుతాయి. ప్రస్తుత యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ, మామిడి, ఇతర పంటలు సాగయ్యాయి. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారిం ది. ఎంజీకేఎల్ఐలో స్టాండ్ బై మోటర్తో కలిపి మొత్తం ఐదు మోటర్లు ఉన్నాయి. నెల రోజులుగా మూడు మోటర్లను ఏకధాటిగా రన్ చేస్తున్నారు. నాలుగో మోటర్ అందుబాటులో లేకపోవడంతో మన వాటాను సక్రమంగా వినియోగించుకునే అవకాశం లేకుండాపోయింది. రేవంత్ సర్కార్ పట్టింపులేని తనంతో చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం కష్టంగా మారింది.
ఆంధ్రా ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఎంజీకేఎల్ఐకి కృష్ణా నీళ్లు అందడం కష్టతరంగా మారుతున్నది. కేఎల్ఐ కింద ఎకరా ఎండినా రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రత్యామ్నాయం మార్గాల ద్వారా సాగునీటి ఇబ్బందులు లేకుండాచూడాలి.