హైదరాబాద్, మే5 (నమస్తే తెలంగాణ) : వేసవి తాగునీటి అవసరాలు, కృష్ణా నదీ జలాల వినియోగంపై ఆ నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. 10 తర్వాత ఏపీలోనే సమావేశాన్ని నిర్వహించాలని మెలికపెట్టింది. తెలంగాణ అధికారులు మాత్రం సమావేశానికి హాజరై రాష్ట్ర నీటి అవసరాలను మరోసారి బోర్డుకు నివేదించారు. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటినిల్వలను ఏ రాష్ట్రం ఎంత మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్లవారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. మే, జూన్, జూలై నెలల నీటివాటాలపై కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ సోమవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జూలై 31 వర కు కల్వకుర్తికి 300 క్యూసెకులు, హైదరాబాద్కు 750 క్యూసెకులు, ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల కోసం 300 క్యూసెకులు ఇవ్వాలని కోరారు. జూలై నెలాఖరు వరకు తెలంగాణ తాగునీటి అవసరాల కోసం 10.26 టీఎంసీలు అవసరమని తెలిపారు. ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో కలిపి 15 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, అందులో 4.28 టీఎంసీలు ఆవిరి నష్టాలు, తెలంగాణ అవసరాలు పోగా మిగిలేది 0.55 టీఎంసీలేనని వివరించారు. సాగర్ నుంచి ఏపీ 510 క్యూసెక్కులు దిగువకు పంపింగ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని గతంలోనే ఏపీ చెప్పామని వెల్లడించారు. కేఆర్ఎంబీ ఆదేశాలు లేకుండా సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్, ముచ్చుమర్రి నుంచి నీటిని వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా సమర్పించారు.
తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా 10 టీఎంసీలు ఇవ్వాలని ఇప్పటికే ఇండెంట్ పెట్టిన ఏపీ.. ఆ మేరకు జలాలను కూడా తరలిస్తున్నది. కానీ నీటివాటాలపై నిర్వహించిన సమావేశానికి మాత్రం డుమ్మా కొట్టింది. ఈ నెల 10 తర్వాత ఏర్పాటు చేయాలని, దాన్ని కూడా ఏపీలో నిర్వహించాలని కోరుతూ లేఖ రాసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ ఏపీలో ఉండాని, సమావేశాలను కూడా అక్కడే నిర్వహించాలని త్రీమెన్ కమిటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది.