ఏపీ పిటిషన్ ఉపసంహరణ మెమోపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
ఏపీయే తమకు బకాయి ఉందన్న తెలంగాణ
రిట్లోని అంశాల ఆధారంగా విచారణ జరపాలని వినతి
ఏపీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదంటూ ఏపీ జెన్కో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నది. తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు 2021 ఆగస్టు నాటికి అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ.6283.68 కోట్లు చెల్లించాలని ఏపీ జెన్కో ఎండీ బీ శ్రీధర్ గతంలో వేసిన రిట్‌ను వాపస్ తీసుకున్నారు. ఈ మేరకు దాఖలు చేసిన మెమోను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో ప్రతిపాదనను తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో తీవ్రంగా వ్యతిరేకరించాయి. పిటిషన్లు వేయడం, ఉపసంహరించుకోవడం ఏపీకి పరిపాటిగా మారిందని తెలంగాణ తరఫున న్యాయవాది వై రామారావు అభ్యంతరం చెప్పారు. ఏపీ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించొద్దని కోరారు. ఏపీ పిటిషన్‌లోని అంశాల ఆధారంగా విచారణ చేపట్టి తుది ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కోరారు.
ఏపీనే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సివుండగా ఏపీ ఈ తరహా పిటిషన్లు పలు చోట్ల దాఖలు చేసి వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఇదే తరహాలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్ సీఎల్ టీ) హైదరాబాద్ బెంచ్ ముందు కూడా పిటిషన్ వేసిందని గుర్తు చేశారు. రెండేండ్ల తర్వాత గత ఏడాది ఎన్సీఎల్టీలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నదని వివరించారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాల పరిషారానికి కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ఎదుట సమస్యను పరిషరించుకుంటామని ఏపీ చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఏపీ విద్యుత్తు సంస్థల నుంచి తెలంగాణకు రూ.12,940 కోట్లు రావాల్సి ఉన్నదని, ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు సంస్థలు కౌంటర్ పిటిషన్లు కూడా దాఖలు చేసినట్టు గుర్తు చేశారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో ఎండీ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని, రిట్ పిటిషన్‌లోని అంశాల ఆధారంగా కేసు విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని కోరారు.
తొలుత ఏపీ తరఫున న్యాయవాది ఎం విద్యాసాగర్ వాదిస్తూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిషారం నిమిత్తం కేంద్రం ఫిబ్రవరి 11న ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీలో విద్యుత్తు బకాయిల వివాదాన్ని పరిషరించుకుంటామని, ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని కోరారు. 201417 మధ్యకాలంలో తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచి రూ.3441.78 కోట్ల మేరకు అసలు, రూ.2841.90 కోట్లు వడ్డీ రూపంలో మొత్తం రూ.6283.68 కోట్లు బకాయిల కింద చెల్లించాల్సివుందని వివరించారు. కేంద్రం వేసిన కమిటీ ఎదుట వివాదం పరిషారం కానిపక్షంలో హైకోర్టుకు తిరిగి వస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. వాదనల తర్వాత ఏపీ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.