హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): సాంకేతిక సలహా కమిటీ అనుమతి పొందని ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులని, ఆ విధంగా ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆమోదం పొందినవేనని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది. నిర్దిష్ట నీటి కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో బుధవారం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తలపాత్ర ఎదుట ఏపీ తరఫున సీనియర్ అడ్వకేట్ జయదీప్గుప్తా వాదనలు వినిపించారు.
ట్రిబ్యునల్-1 కేటాయింపులను మళ్లీ విభజించాలనడం తప్పుడు ప్రతిపాదనని తెలిపారు. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించేందుకు తగిన ఆధారం కావాలని అన్నారు. తెలంగాణ ప్రతిపాదించినట్టుగా ప్రస్తుత పంటల నమూనాలో మార్పులు కూడా సరైన ప్రతిపాదన కాదని చెప్పారు. కేవలం ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగానే ప్రస్తుత ట్రిబ్యునల్ నీటి కేటాయింపులను చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మిగులు జలాలను ఉపయోగించుకునే స్వేచ్ఛ దిగువ రాష్ర్టానికి ఉన్నదని ట్రిబ్యునల్ అవార్డు తుది ఉత్తర్వులోని సెక్షన్ 5(సీ) ఈ స్వేచ్ఛ కల్పించిందని వివరించారు.
తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదు
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా తమకు 700 టీఎంసీలకుపైగా జలాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం సహేతుకం కాదని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు పేర్కొన్నారు. దానిని ఏపీ రైతులు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై తెలంగాణ వాదనలకు విలువ లేదని వివరించారు.