హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బనకచర్ల ప్రాజెక్టును (Banakacherla Project) రద్దు చేసిన ఏపీ సర్కారు.. పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింక్ ప్రాజెక్టును (PN Link Project) చేపట్టేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. త్వరలో పీఎన్ లింక్ డీపీఆర్ తయారీకి సంబంధించిన టెండర్లను ఆహ్వానించేందుకు సన్నద్ధమవుతున్నది. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ తొలుత పోలవరం-బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. వరద జలాల పేరిట 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు రూ.80,112 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటు డీపీఆర్ తయారీకి టెండర్లను సైతం ఆహ్వానించింది. అయితే కేంద్ర సంస్థలు, బేసిన్ రాష్ర్టాలు, ఏపీలోని మేధావులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో చంద్రబాబు సర్కారు వెనకడుగు వేసింది.
ఆర్థికభారం వల్ల ఆ ప్రాజెక్టులో పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించి ఇటీవల టెండర్లను రద్దు చేసింది. ప్రస్తుతం బనకచర్ల లింక్ ప్రాజెక్టులో పలు మార్పులు చేసింది. అందులో భాగంగా గోదావరి వరద జలాలను ప్రకాశం-బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా పోతిరెడ్డిపాడు దిగువన బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్ వరకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం అందులో స్వల్ప మార్పులు చేసింది. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు కాకుండా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో వరద జలాల ఆధారంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులోని నల్లమల రిజర్వాయర్‌కు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక అమలుకు మొత్తం రూ.58వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ)తో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. తాజాగా పీఎన్ లింక్ డీపీఆర్ తయారీకి సైతం ఏపీ సిద్ధమైంది. అందుకోసం రెండు మూడు రోజుల్లో టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.