హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ) : పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత వాస్తవ స్థితి ఏమిటనేది వారంలోగా చెప్పాలని ఏపీ సర్కారును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీకి బోర్డు చైర్మన్ శుక్రవారం లేఖ రాశారు. ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాల మళ్లింపు కోసం రూ. 81వేల అంచనా వ్యయంతో ఏపీ సర్కారు పీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వాటన్నింటినీ బేఖాతర్ చేస్తూ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీల ఎంపికకు రూ.9.2 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ తెలంగాణ ఈఎన్సీ అమ్జద్హుస్సేన్ గోదావరి రివర్బోర్డుకు ఫిర్యాదు చేశారు. టెండర్లపై ముందుకు వెళ్లకుండా ఏపీని నిలువరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జీఆర్ఎంబీ తాజాగా స్పందించింది.
హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): కేసీ (కర్నూలు కడప) కెనాల్ నుంచి ఒక టీఎంసీ జలాలను తుంగభద్ర డ్యామ్ రైట్ బ్రాంచ్ హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ)కి మళ్లించుకునేందుకు ఏపీకి అనుమతిస్తున్నట్టు తుంగభద్ర బోర్డు వెల్లడించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ ఓఆర్కే రెడ్డి ఏపీతోపాటు, సభ్య రాష్ర్టాలకు లేఖరాశారు. ఒక టీఎంసీ జలాలను కేసీ కెనాల్ నుంచి హెచ్ఎల్సీకి మళ్లించుకుని వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని ఏపీ ఇటీవల బోర్డుకు లేఖ రాసింది. దీనిపై బోర్డు తాజాగా స్పందించింది.