అమరావతి: ఏపీ మెగా డీఎస్సీ (AP DSC) పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. శుక్రవారం (జూన్ 6) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరుగనున్నాయి. మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు మరో సెషన్ ఉండనుంది. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మొత్తం 16,437 పోస్టులకు 3,36,305 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్లో మరో 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కాగా, ఏపీ డీఎస్సీ పరీక్షలకు నాన్ లోకల్ కింద 20 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడేందుకు తెలంగాణ చెందిన సుమారు 7 వేల మంది దరఖాస్తు చేశారు. అయితే కొన్ని తేదీల్లో ఒకేరోజు తెలంగాణ టెట్, ఏపీ డీఎస్సీ పరీక్ష వస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా, మరికొందరు ఏపీ వెళ్లి రాయాల్సి ఉంటుంది. 8 రోజులపాటు రెండు రాష్ట్రాల పరీక్షలు ఉండగా, 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్-1, అటు ఏపీ డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు పరీక్ష ఉండటం సమస్యగా మారింది.