హైదరాబాద్, జూన్ 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరి పన్నెండేండ్ల ఆవిర్భావ సంబురం జరుపుకొంటున్న వేళ పసి తెలంగాణపై మరో కుట్రలనాగు విషం చిమ్మింది. ఆరున్నర దశాబ్దాల అరిగోస, అవహేళనలను మరచిపోకముందే మరోసారి ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రసంగించి ఉద్రిక్తతలకు కారణమైంది. రెండు రాష్ర్టాల ప్రజల మధ్య ఉన్న సఖ్యతను చెడగొట్టే రాజకీయ కుట్రలో ‘పావు’లాగా మారి అక్కసు వెళ్లగక్కడం తెలంగాణ ప్రజల గుండెల్లో అగ్గిని రాజేసింది. సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ వ్యతిరేకశక్తులు ఇలా ఈ గడ్డపై గద్దల్లా వాలుతూ తమ కుట్రలకు పనిజెప్పుతున్నారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు ఈ కుట్రలను తిప్పికొట్టింది. కానీ నేడు.. హైదరాబాద్ నడిబొడ్డుపై సభకు అనుమతినివ్వలేదని ప్రెస్‌మీట్ పేరిట తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరి మరీ ఓ గొంతు విషం కక్కింది. అడ్డం.. పొడువూ నోరు పారేసుకుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండు రోజులు అన్నపానీయాలు ముట్టలేదంటూ గతంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి తన విద్వేషాన్ని వెళ్లగక్కడంపై నెటిజన్లు మండిపడ్డారు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని గతంలో నోరుపారేసుకున్న పీకే, మరోసారి తన అక్కసు వెళ్ల్లగక్కడం తాజాగా హీట్‌ను పుట్టించింది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిద్రావస్థకు చేరిన ఈ కాలనాగులు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ రెండున్నరేండ్ల జాయింట్ యాక్షన్ పాలనలో మరోసారి నిద్రలేచాయంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారని పదేపదే అవమానిస్తున్న ప్రధాని మోదీకి మిత్రబంధంగా కొనసాగుతున్న జనసేనాని ఇంతకన్న మంచి మాటలు ఎలా మాట్లాడుతారని ధ్వజమెత్తారు.
ఆది నుంచి తెలంగాణపై రెండు కండ్ల సిద్ధాంతమంటూ కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు భజనకారి అయిన పీకేకు ఇంతకన్నా మంచిరాగం ఎక్కడి నుంచి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ర్టానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని తెలువకపోవడం ఆయన ధోరణికి నిదర్శనంగా కనిపిస్తున్నదని మండిపడ్డారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా..’ అనడంపై ఘాటుగా స్పందించారు. సినిమాల్లో ఇలాంటి డైలాగులు పనికొస్తాయని.. ఇక్కడ కాదని చురకలంటించారు.
తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డనూ అవమానించేలా పవన్‌కల్యాణ్ మాటలు ఉన్నాయంటూ విమర్శించారు. ఉద్రేకపూరిత ప్రసంగాల ద్వారా యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు, బంగారు తెలంగాణను దోచుకునేందుకు ఓ నాటకాల బ్యాచ్ బయలుదేరిందంటూ ఎద్దేవా చేశారు. ‘ఎవడిపాలయ్యిందిరో.. తెలంగాణ.. ఎవడేలుతున్నడురో తెలంగాణ’.. అంటూ ఓ నెటిజన్ ఆవేదన వెలిబుచ్చాడు. పార్లమెంట్ సాక్షిగా మోదీ, మొన్న తేజస్వీ సూర్య, నిన్న టీడీపీ మహానాడులో తెలంగాణ నాయకుడు బక్కని నర్సింహులు, ఈ రోజు పవన్‌కల్యాణ్.. ఇలా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తెలంగాణ నుంచి కట్టుబట్టలతో తరిమేశారంటూ మొసలి కన్నీరు కార్చిన ఈ నేతలు ఇప్పుడు తెలంగాణ రాజధానిలో నిస్సిగ్గుగా నిలబడి ప్రెస్‌మీట్ పెట్టి సవాల్ విసురుతున్నారు.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదగడం ఓర్వలేని వీరంతా ఏకమై చేసిన, చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రజలే గుర్తించాలి.. జాగో తెలంగాణ.. అంటూ సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో పోస్టులు పెట్టారు. తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ నేలపై నిల్చొని తెలంగాణను అవమానించేలా మాట్లాడిన పీకేకు పలువురు నెటిజన్లు ఇలా చురకలంటించారు.
‘నీ ఇల్లు పిఠాపురంలో ఉందనుకున్నాం, నీకు ఏమైనా ప్రెస్మీట్లు ఉంటే నువ్వు గెలిచిన, నిన్ను నమ్మిన ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్టుకోవాలి. కానీ హైదరాబాద్‌లో నీకేం పని?” అంటూ సుకుమార్ కే అనే నెటిజన్ ప్రశ్నించారు. ‘ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటూ, తెలంగాణలో మళ్లీ మత రాజకీయాలు, చెరువుల కబ్జాల గురించి మాట్లాడటానికి వచ్చావా?’ అని రాజు అనే నెటిజన్ నిలదీయగా.. ‘ఏపీ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, జూబ్లీహిల్స్‌లో కూర్చుని రాజకీయం చేయడమేంటీ? అసలు మీరు ఏ రాష్ట్రానికి సేవ చేస్తున్నారం’టూ రక్షిత అనే నెటిజన్ ప్రశ్నించారు.
రెండున్నరేండ్లుగా తెలంగాణ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న సీఎం రేవంత్‌ను ఒక్క మాట కూడా అనవేం? అంటూ పవన్‌ను జర్నలిస్ట్ పండరి ప్రశ్నించారు. తెలంగాణపై అవగాహన లేకుండా, సబ్జెక్ట్ లేకుండా పవన్ ఏదేదో మాట్లాడారని ఎద్దేవా చేశారు. పవన్‌కళ్యాణ్ స్పీచ్ ఎంతో అపరిపక్వతతో ఉన్నదని డాక్టర్ ప్రదీప్‌రెడ్డి చింత అనే నెటిజన్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో గద్దర్‌ను అవమానించేలా మాట్లాడిన అమిత్ షాను పవన్ నిలదీయగలరా? అని అలీ షేక్ అనే నెటిజన్ ప్రశ్నిస్తూ.. తెలంగాణ ఉద్యమాన్ని పవన్ అవమానించారని మండిపడ్డారు. పవన్‌ను ఓ రాజకీయ జోకర్‌గా ఇలియాస్ అనే నెటిజన్ అభివర్ణించారు. ఏపీలో జనసేన, తెలంగాణలో బీజేపీకి ‘భ’జన సేన అంటూ పలువురు కామెంట్లతో విరుచుకుపడ్డారు. త్యాగాల తెలంగాణను దొంగలభారి నుంచి కాపాడుకోవాలి.. అంటూ వై ప్రగతి అనే నెటిజన్ ఎక్స్‌లో స్పందించారు.