రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే.. నేనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. గోదావరిలో పుషలంగా నీళ్లున్నాయి కాబట్టే అభ్యంతరం చెప్పలేదు.
– 2026, జనవరి 5న గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఆ రాష్ట్రమే గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నది. మేం కేవలం నల్లమలసాగర్ డీపీఆర్ తయారు చేస్తే తెలంగాణకు నష్టమేమిటి? ఏపీ భూభాగంలో చేపట్టే నిర్మాణాలపై తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారత ఏమిటి?
– 2026 జనవరి 5న సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు
తెలంగాణ ప్రభుత్వం 16 ప్రాజెక్టుల సామర్థ్యా లను విస్తరిస్తున్నది. ఇన్‌టేక్ పాయింట్లు మార్చినా, అలైన్మెంట్లో మార్పు లున్నా, కమాండ్ ఏరియా, నిల్వ సామర్థ్యాలను పెంచినా అవి కొత్త ప్రాజెక్టులుగానే చూడాల్సి ఉంటుంది. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలి
– 2025 డిసెంబర్ 16న కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ సర్కార్ ఫిర్యాదు
హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు కండ్ల సిద్ధాంతంతోపాటు రెండు నాల్కల ధోరణి సైతం మరోసారి బట్టబయలైంది. ‘తెలుగు రాష్ర్టాల మధ్య విద్వేషాలు ఉండకూడదు’ అంటూ ఆయన నోటివెంట వెలువడిన మాటలన్నీ పైకి మాత్రమేనని మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ప్రాజెక్టులపై పనిగట్టుకుని కేంద్రానికి, ఫిర్యాదులు చేస్తూ, మరోసారి జలవివాదాలు వద్దంటూ సుద్దులు చెప్పడమే చర్చనీయాంశంగా మారింది. కేంద్రానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తాజాగా రాసిన లేఖలతో ఏపీ సర్కార్ వ్యవహారం తేటతెల్లమైంది. నీతులు చెప్పడానికే తప్ప ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్న అంశం మరోసారి బట్టబయలైంది.
కృష్ణా జలాలను అక్రమంగా పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను విస్తరిస్తున్నది. గతంలోనే పెన్నా బేసిన్లో 350 టీఎంసీలకు పైగా నీటినిల్వ రిజర్వాయర్లను, శ్రీశైలానికి గండికొట్టేలా అనేక ప్రాజెక్టులను చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయా అక్రమ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నది. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టుల కాలువల సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుతున్నది. గోదావరి జలాలను సైతం మళ్లించేందుకు పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు సిద్ధమైంది. కానీ తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రాజెక్టునూ అక్రమమేనంటూ ఏపీ ఫిర్యాదులకు దిగుతున్నది. ఇంకోవైపు తిరిగి ఏపీ సీఎం చంద్రబాబు నీతులు చెప్పడమే ఇక్కడ కొసమెరుపు.
చంద్రబాబు బడాయి ముచ్చట్లు
ఇటీవల గుంటూరు తెలుగు మహాసభల్లో బాబు చేసిన వ్యాఖ్యలే అందుకు నిలువెత్తు నిదర్శనం. ‘తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఐక్యతగా ఉండాలి. విద్వేషాలు వద్దు. తెలుగు ప్రజలంతా అభివృద్ధిలో కలిసి నడవాలి. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులను తెలంగాణలో కట్టాను. విభజన తర్వాత వాళ్లు కాళేశ్వరం కడితే.. అందుకు నేనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలి. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌వన్‌గా ఉండాలంటే ఐకమత్యంగా ఉండాలి. అందుకు తాను కట్టుబడి ఉన్నాను. గంగా-కావేరి కలువాలి. దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలి. అదే తన కోరిక” అంటూ చంద్రబాబు బడాయి ముచ్చట్లు ఎన్నో చెప్పారు.
కేఆర్ఎంబీ లేఖతో బండారం బట్టబయలు
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాగుతోపాటు హైదరాబాద్ తాగునీటికి సంబంధించి పలు ప్రాజెక్టులను విస్తరిస్తూ, కొత్తగా ప్రతిపాదిస్తూ నిరుడు సెప్టెంబర్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 34ను జారీచేసింది. అందులో రేలంపాడు, గట్టు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, నెట్టెంపాడు ఫేజ్-2, బొజ్జా తండా-భీమా తండా లిఫ్ట్ సీమ్, కల్వకుర్తి లిఫ్ట్ ఫేజ్-2, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్, కోయిల్‌కొండ-గండీడ్ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్, కోయిల్‌సాగర్ లిఫ్ట్ సీమ్ సామర్థ్యం పెంపు, ఆకేరు, మున్నేరులపై పలు బరాజ్‌లు, ఎస్ఎల్బీసీ కెనాల్ విస్తరణ, హైదరాబాద్ సిటీతోపాటు రీజినల్ రింగ్ రోడ్ ప్రాంతంలో తాగునీటి అవసరాల కోసం దేవులమ్మ నాగారం, దండు మైలారం, ఆరుట్లలో రిజర్వాయర్ల నిర్మాణం మొత్తంగా 16 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేసింది.
వాటికి డీపీఆర్‌లను తయారు చేసేందుకు అనుమతులిస్తూ జీవో విడుదల చేసింది. అవన్నీ అక్రమ ప్రాజెక్టులే అంటూ కేంద్రానికి ఏపీ సర్కారు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేస్తూ వస్తున్నది. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టులు, అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు సైతం అక్రమమేనని అభ్యంతరాలు తెలుపుతున్నది. ఇన్‌టేక్ పాయింట్లు మార్చినా, అలైన్మెంట్లో మార్పులున్నా, కమాండ్ ఏరియా, నిల్వ సామర్థ్యాలను పెంచినా కొత్త ప్రాజెక్టులుగానే చూడాలని, కొత్తగా సీడబ్ల్యూసీ అనుమతులు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు తీసుకోవాలని, లేదంటే కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది.
16 ప్రాజెక్టులు ఆపాలంటూ ఏపీ లేఖలు
16 ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘానికి నిరుడు డిసెంబర్ 5న, 8న కేఆర్ఎంబీకి ఏపీ లేఖలు రాసింది. ఏపీ రాసిన ఆ ఫిర్యాదు లేఖలను జతచేస్తూ తాజాగా కేఆర్ఎంబీ కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు లేఖలన్నీ వెలుగు చూడటంతో ఏపీ సర్కార్ వ్యవహారం బట్టబయలైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్, డిండి, భీమా, భక్తరామదాసు సహా 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లోనూ ఏపీ లేఖలు రాసింది. ఆ ప్రాజెక్టులను అడ్డుకోవడంపైనా దృష్టి సారించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకోవడానికి 2015 నుంచి 2017 వరకు 5 సార్లు లేఖలు రాసినట్టు తేటతెల్లమైంది. కల్వకుర్తి, ఎస్సారెస్పీ స్టేజ్-1, సీతారామ, కాళేశ్వరం, భక్తరామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్‌ను సైతం ఆపించాలని కేంద్రానికి లేఖ రాసింది.
ఏపీ లేఖలతోనే కేంద్రానికి కేఆర్ఎంబీ ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వం ఆ 16 ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీకి సిద్ధమైందని ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై స్పందించాలని తెలంగాణకు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందిన కేఆర్ఎంబీ వెల్లడించింది. ఆయా ప్రాజెక్టుల సమాచారాన్ని కూడా తెలంగాణ అందించలేదని స్పష్టంచేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులను చేపట్టాలంటే బోర్డుల అనుమతితోపాటు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరమంటూ బోర్డు సైతం నిబంధనలను ఏకరువు పెట్టింది. ఏపీ రాసిన లేఖలన్నీ ఫిర్యాదుతోపాటు కేఆర్ఎంబీ జతచేసి కేంద్రానికి నివేదించింది. కానీ ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదులను బోర్డు ఎక్కడా పేర్కొనలేదు.
‘తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఐక్యతగా ఉండాలి. తెలుగు ప్రజలంతా అభివృద్ధిలో కలిసి నడవాలి. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులను కట్టా. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే.. అందుకు నేనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. గోదావరిలో పుషలంగా నీళ్లున్నాయి కాబట్టే అభ్యంతరం చెప్పలేదు. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలి’
– 2026, జనవరి 5న గుంటూరు తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
‘తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఆ రాష్ట్రమే గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నది. మేం కేవలం నల్లమలసాగర్ ఫీజిబులిటీ రిపోర్టు మాత్రమే రూపొందిస్తున్నాం. డీపీఆర్ తయారు చేస్తే తెలంగాణకు వచ్చే నష్టమేమిటి? ఏపీ భూభాగంలో చేపట్టే నిర్మాణాలపై తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారత ఏమిటి?. నీటి కేటాయింపులకు అనుగుణంగా ఏ నిర్మాణాలనైనా చేసుకునే హకు ఏపీకి ఉన్నది. నిర్మాణాలు నిలుపుదల చేయాలని కమిటీ ఎలా చెబుతుంది. ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్ ప్రక్రియ ముందుకు సాగుతుంది.
– 2026 జనవరి 5న సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు
‘తెలంగాణ ప్రభుత్వం 16 ప్రాజెక్టుల సామర్థ్యాలను విస్తరిస్తున్నది. ఇన్‌టేక్ పాయింట్లు మార్చినా, అలైన్మెంట్లో మార్పులున్నా, కమాండ్ ఏరియా, నిల్వ సామర్థ్యాలను పెంచినా అవి కొత్త ప్రాజెక్టులుగానే చూడాల్సి ఉంటుంది. అందుకు మళ్లీ కొత్తగా కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలి. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలి’
– 2025 డిసెంబర్ 16న కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ సర్కారు ఫిర్యాదు