హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పుట్టిందని.. తెలంగాణపై కచ్చితంగా తమ ఫోకస్ ఉంటుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. ఓ చానల్‌కు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. టీడీపీని తెలంగాణలో విస్తరించే ఆలోచన ఉందా? అని ప్రశ్నించగా.. ‘తెలుగు జాతి అభివృద్ధి ధ్యేయంగా టీడీపీని స్థాపించాం. అదే సమయంలో ఇతర రాష్ర్టాలకు విస్తరించాలనే ఆలోచన మొన్నటివరకు లేదు. రెండు తెలుగు రాష్ర్టాలు విడిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినా.. పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి కార్యాచరణ రూపొందిస్తాం. తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ల అభివృద్ధి కోసం టీడీపీ పని చేస్తుంది’ అని అన్నారు. మీరు జైలులో ఉన్నప్పుడు కానీ.. మీపై వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పుడు గానీ.. ఖమ్మం, హైదరాబాద్‌లో నిరసనలు జరిగాయి కదా..? అని గుర్తుచేయగా.. ‘తెలంగాణలో కార్యకర్తలు ఉన్నారు.. వారిని, ఎన్ఆర్ఐలను లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాలి. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నం.1గా ఉండాలనేది నా కోరిక’ అని తెలిపారు.