మహబూబ్‌నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరబడుతున్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కండ్లుగప్పి పెద్దఎత్తున నీటి దోపిడీకి పాల్పడున్నది. వచ్చిన వరదను వచ్చినట్టే తరలించి.. శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా అడ్డుపడుతున్నది. జూరాల నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే నింపి ఉంటే ఈపాటికి శ్రీశైలం గేట్లు ఎత్తేవారు. కానీ, చంద్రబాబు సర్కార్ వరద ప్రారంభం కాగానే హంద్రీనీవా సుజల స్రవంతి, మల్యాల, ముచ్చుమర్రి, సుంకేసుల, పోతిరెడ్డిపాడు స్టేజ్-1, స్టేజ్-2కు వందలాది క్యూసెక్కుల నీటిని యథేచ్ఛగా మళ్లిస్తున్నది. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 10 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్టు చెప్తున్నారు. కానీ, 15 నుంచి 20 టీఎంసీల నీటిని మళ్లించినట్టు అనధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కలను కేఆర్ఎంబీ దాచిపెట్టడం గమనార్హం. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా వరదలు వస్తూనే ఉన్నాయి.
వీటిని సాకుగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో దోపిడీకి తెరలేపింది. జూలై 25వ తేదీన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల వరద జూరాలకు చేరింది. ఆ తర్వాత అత్యధికంగా రెండు లక్షలపైగా క్యూసెక్కుల వరద రావడంతో జూరాల ప్రాజెక్టు మొత్తం గేట్లు ఓపెన్ చేశారు. ఇప్పటివరకు జూరాల నుంచి 18 నుంచి 190 టీఎంసీల నీరు శ్రీశైలానికి చేరినట్టు నీటి పారుదల శాఖ అధికారులు విడుదల చేసిన ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోను బట్టి లెక్కలేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 867 అడుగులు, 167 టీఎంసీలు ఉన్నదని చెప్తున్నారు. అయితే, ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి వెలువడే లెక్కల్లో కూడా ఏపీ ప్రభుత్వ ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నెల రోజులుగా వరదలు వస్తున్న మన ప్రాజెక్టులకు మాత్రం ఇప్పటివరకు తొమ్మిది టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు.
ఇందులో అత్యధికంగా నెట్టెంపాడుకు 2.883 టీఎంసీలు, భీమా, కల్వకుర్తికి చెరో 1.50 టీఎంసీల చొప్పున ఎత్తిపోశారు. నెల రోజులుగా మోటర్లు ఆన్ చేస్తే ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసిన టీఎంసీలు ఇవి. అదే ఏపీ సర్కార్ ఒక్కసారి మళ్లిస్తే పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 8 టిఎంసీలు దిగువకు వెళ్తాయి. మిగతా ప్రాజెక్టులకు మళ్లించిన నీటిని చూస్తే కండ్లు బైర్లు కమ్మడం ఖాయం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ జిల్లావాడే అయినా తమకు అన్యాయం జరుగుతుందని పాలమూరు వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దాదాపు మూడేండ్ల నుంచి కృష్ణా నదికి వరుసగా వరదలు వస్తున్నా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆందోళనకు దిగితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయని పరిస్థితి నెలకొన్నది.
అసలే వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వచ్చిన వరదను వచ్చినట్టే మళ్లించి ఉంటే, మరో అయిదు టీఎంసీల వరకు సాగునీరు అందేది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ మూడేండ్లలో మూడు కిలోమీటర్ల కాలువను పూర్తి చేసి ఉంటే సుమారు 30 నుంచి 40 టీఎంసీల వరకు నీటిని నిలువ చేసే అవకాశం ఉండేది. కనీసం ప్రభుత్వం ఈ నెల రోజుల్లో కృష్ణానదిని ఆనుకొని ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌లో నాలుగు టీఎంసీలైనా నింపి ఉంటే వాటిని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి డైవర్టు చేసే అవకాశం ఉండేది. ముఖ్యమంత్రి సొంత ఊరు ఉన్న కల్వకుర్తి నియోజకవర్గ్గానికి వరద ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా కల్వకుర్తి లిఫ్ట్ జలాలు రాలేదంటే పరిస్థితి ఊహించవచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఉమ్మడి జిల్లాకు వెన్నుపోటు పొడిచారని రైతులు విమర్శిస్తున్నారు.
కృష్ణానదికి భారీ వరద వస్తున్నప్పటికీ, జూరాల కుడి, ఎడమ కాలువలకు నీళ్లు విడుదల చేయకుండా నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు లేవంటూ మౌనం దాల్చారు. దీంతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తామే వెళ్లి తూములను తెరుస్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు కుడి, ఎడమ కాలువలకు సైతం నీటిని వదిలారు. ఇదిలా ఉండగా, భీమా ఫేజ్-2 ప్రాజెక్టుకు కూడా నీటిని వదలకుండా తాత్సారం చేయడంతో మళ్లీ అల్టిమేటం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అయితే వరద వస్తున్నట్టు తెలియగానే అధికారులకు ముందస్తు సమాచారం అందించే వాళ్లు. వచ్చిన వరదను వచ్చినట్టే మళ్లించాలని ఆదేశాలు ఇచ్చేవాళ్లు. దీంతో గత ఎనిమిదేండ్లుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టుల కింద సుమారు పది లక్షల ఎకరాల వరకు సాగు చేశారు. అంతేకాకుండా, చెరువులను నింపి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేవారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మరో ఎనిమిది లక్షల వరకు సాగై ఏకంగా 18 లక్షల ఎకరాల వరకు రికార్డు స్థాయిలో పంటలు పండాయి.
ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణా నదికి జూలై 26న వరద మొదలైంది. అదేరోజు జూరాలకు తాకింది. క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతుండటంతో ఇటు విద్యుత్తు ఉత్పత్తిపాటు అటు స్పిల్‌వే గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని వదిలారు. జూరాల ప్రాజెక్టుకు ఈ నెల రోజులుగా సుమారు 190 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. స్పిల్‌వే (గేట్లు), పవర్ జనరేషన్ ద్వారా వాడుకొని కిందికి వదిలేశారు. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు ఇప్పటివరకు జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 7.228 టీఎంసీలను ఎత్తిపోశారు. జూరాల నుంచి శ్రీశైలం, మధ్యలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1.758 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మొత్తంగా సుమారు తొమ్మిది టీఎంసీలను ఐదు ప్రధాన ప్రాజెక్టులు రెండు కాలువల ద్వారా నీటిని లిఫ్ట్ చేశారు. ఇదిలాఉండగా, శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి సుమారు 190 టీఎంసీల నీటిని వదిలితే, ప్రస్తుతం శ్రీశైలంలో 165 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
ఒకటిన్నర టీఎంసీలు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మళ్లిస్తే, ఏపీ ప్రాజెక్టులకు అధికారిక లెక్కల ప్రకారం సుమారు 15 టీఎంసీలు మళ్లించినట్టు చెప్తున్నారు. ఇటు జూరాల నుంచి విడుదలైన లెక్కలు, అటు శ్రీశైలానికి చేరిన లెక్కల ప్రకారం కేఆర్ఎంబీ ఏపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో కూడా ఇదేవిధంగా జూరాల నుంచి భారీ వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నా, అది నిండకపోవడంతో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేఆర్ఎంబీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీటి మీటర్లను పెట్టాలని గట్టిగా నిలదీయడంతో అటు ఇటు మీటర్లను బిగించింది. అయితే, ఈ మీటర్లు కూడా పని చేయకుండా ఏపీ నాయకులు వాటిని ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో మీటర్ల మాట పక్కన పెట్టి ఉత్తుత్తి లెక్కలు బయట పెడుతున్నది. ఈ లెక్కన ఇప్పటికే 30 టీఎంసీలకుపైగా ఏపీ తరలించుకొనిపోయినట్టు తెలుస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన వరదను వచ్చినట్టే తన్నుకు పోతుండటంతో నాగార్జునసాగర్ కింద ఉన్న ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం దిగువ భాగాన ఉన్న తెలంగాణ జిల్లాలకు చుక్కనీరు అందని పరిస్థితి కనబడుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుపెట్టి, గోదావరికి వచ్చిన వరదను వచ్చింది వచ్చినట్టే కిందికి వదిలిపెట్టిన రేవంత్ సర్కార్.. అదే రీతిలో కృష్ణా జలాలను కూడా వదిలేసింది. ఎగువన కురిసిన వర్షాలకు వరద వస్తుంటే మన ప్రాజెక్టులకు నీళ్లను లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం చేష్టలుడికి చూసింది. చివరకు బీఆర్ఎస్ నేతల హెచ్చరికల నేపథ్యంలో వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించింది. ఇటు గద్వాలకు చెందిన నేతలు, అటు మక్తల్ నియోజకవర్గానికి చెందిన నేతలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది. ఇదిలా ఉండగా జూలై 26వ తేదీన జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. అదేరోజు రాత్రికి భారీఎత్తున వరద వస్తుండటంతో ఏపీకి మేలు చేసేలా వచ్చిన వరదను వచ్చినట్టే విద్యుత్తు ఉత్పత్తి పేరుతో తెలివిగా కిందికి వదిలిపెట్టారు.
ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎంత మొత్తుకున్నా క్యాబినెట్ ఆమోదం ఉంటే తప్ప నీటిని వదిలే ప్రసక్తే లేదని ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల కార్యనిర్వాహక అధికారి అనడం విమర్శలకు తావిచ్చింది. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 24 గంటల లోపల భీమా ప్రాజెక్టు ఫేజ్-1 మోటర్లను ఆన్ చేయకపోతే, తానే వెళ్లి ఆన్ చేస్తానని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన ఇంజినీర్లు మూడు మోటర్లలో ఒక్క మోటర్ మాత్రమే ప్రారంభించి చేతులు దులుపుకొన్నారు. మళ్లీ ఆయన అల్టిమేటం ఇవ్వడంతో రెండు రోజుల తర్వాత ఇంకొక మోటర్ ఆన్ చేశారు. నడిగడ్డకు చెందిన బీఆర్ఎస్ నేత బాసు హనుమంతునాయుడు కూడా జూరాల ప్రాజెక్టుపై ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం రాత్రికి రాత్రే నీటి విడుదలకు అంగీకరించింది. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు అరకొర నీటిని ఎత్తిపోస్తూ ప్రతిరోజూ వస్తున్న లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్కులను కిందికి వదలడం గమనార్హం. ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు మళ్లించుకునేందుకు రాష్ట్ర సర్కార్ జూరాల ప్రాజెక్టు నీటి విడుదలపై ఆంక్షలు విధించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా తామేమీ చేయలేమని చేతులెత్తేసింది.
