Rakesh Reddy | హైదరాబాద్ : బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్.. భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశంసించారు. బీజేపీకి రాజీనామా చేసిన రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాకేశ్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి, జనగాం అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో పాటు పలువరు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్.. భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్. వారి సారథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్లో చేరుతున్నందుకు సంతోషపడుతున్నాను. ఎంతో మంది యువ నాయకులను, ప్రజాప్రతినిధులను తయారు చేసి శరవేగంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నారు. పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలని, ప్రజాసేవకు అంకితం కావాలని నేను 11 ఏండ్ల క్రితం అమెరికాలో ఉన్నత ఉద్యోగం వదిలేసి వరగంగల్ గడ్డ మీద అడుగుపెట్టి, బీజేపీలో చేరాను. నాటి నుంచి మొన్నటి వరకు పార్టీయే ప్రాణంగా, కార్యకర్తలను కుటుంబ సభ్యులగా భావించి ప్రజలకు అంకితమై సేవలందించాను. ఎన్నో కార్యక్రమాలు, పోరాటాలు చేశాను. 6 వేల ఓట్లు ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తద అన్న స్థాయికి తీసుకెళ్లాను. బీజేపీని ప్రతి గుడిసెకు తీసుకెళ్లాను అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీలో యువతకు ప్రాధాన్యం లేదు. ప్రతిభకు స్థానం లేదు. ప్రజాబలం ఉన్నటువంటి వారికి గుర్తింపు లేదు. డబ్బులు ఉన్నవారికే గుర్తింపు ఉంది. తేజస్వి సూర్యను చూపించి యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పి దేశమంతా ప్రచారం చేస్తారు. తెలంగాణకు కూడా, వరంగల్ కూడా ప్రతి జిల్లాకు సూర్య కావాలని ఆలోచన లేదు. కానీ బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో యువ నాయకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు అయ్యారు. పనితనానికి ప్రాధాన్యం లేనటువంటి బీజేపీలో కొనసాగడం అవసరం లేదని చెప్పి రాజీనామా చేశాను. ఒక విజన్, ఎజెండా లేదు. ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయలేదు. బీజేపీ ఆదరణ కోల్పోయింది. అగ్ర నాయకులు సైతం ఇతర పార్టీలకు వెళ్తున్నారు. బీఆర్ఎస్లో చేరుతున్నారు అని రాకేశ్ రెడ్డి తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో ఎన్నో రకాల వివక్షలు, అనేక రంగాల్లో నిర్లక్ష్యం. ఎడారిలో నీటి చెలిమెలాగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఆశాకిరణంగా కనబడ్డారు. ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆవేశానికి ఆలోచన జోడించి, తెలంగాణను సాధించారు. నాయకుడు సమర్థుడు అయితే వానపాములు సైతం నాట్యమాడుతాయన్నట్లుగా కేసీఆర్ జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటే పిల్లాజెల్లా ఏకమైన రాష్ట్రం కోసం కొట్లాడారు అని రాకేశ్ రెడ్డి గుర్తు చేశారు.
లక్ష్యం ఉంటే ఆ భగవంతుడే తోవ చూపిస్తడు. కొట్లాది గుండెల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి తెలంగాణ వాదానికి కేసీఆర్ రూపురేఖలు ఇచ్చారు. తెలంగాణకు ఎప్పుడు ఏం అవసరమో, ఏం చేయాలని తెలిసిన వ్యక్తి కేసీఆర్. ఆ రకంగా గత 11 ఏండ్లుగా సంపూర్ణమైన అవగాహనతో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. శాశ్వత పనులకు శ్రీకారం చుట్టారు. ఒక దూరదృష్టితో నిర్మాణాత్మకంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్తూ.. ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరించారు కేటీఆర్. వారిని నేను కొద్దిరోజుల క్రితం కలిశాను. 40 నిమిషాలు మాట్లాడారు. రెండు నిమిషాలు మాట్లాడి పంపిస్తరు అనుకున్నాను. కానీ నా నేపథ్యం తెలుసుకున్నారు. చాలా ఫ్రాంక్‌గా మాట్లాడారు. వారి మనస్తత్వం చూసిన తర్వాత ఇలాంటి నాయకుడి తోటి ప్రయాణం చేయాలనే భావన కలిగింది. బీజేపీలో 11 ఏండ్లు అగ్ర నాయకులతో పని చేశాను. కానీ 40 నిమిషాలు టైం ఇచ్చి నా నేపథ్యాన్ని కనుగొన్న నాయకుడు ఎవరూ లేరు. రామన్న ఒక విజన్ ఉన్న నాయకుడు.. అందుకే భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని పేర్కొన్నానని రాకేశ్ రెడ్డి తెలిపారు.
నాకు బీజేపీ టికెట్ ఇవ్వన్నప్పుడు కార్యకర్తలు బాధపడుతారు. అది సహజమే. కానీ గుడిసెల్లో ఉన్నవారు ఏడ్చారు. మా వారు ఎవరూ మందలించలేదు. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి నన్ను అక్కున చేరుకున్నారు. ప్రశ్నించే గొంతుకను పాలనలో భాగస్వామం చేయాలని నన్ను ఆహ్వానించారు. మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించేందుకు అన్నిరకాలుగా పని చేస్తాను అని రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు.