Anti Narcotics | మస్తాయిసాయి డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని అధికారులు రంగంలోకి దింపారు. మస్తాన్‌సాయి డ్రగ్స్ దందాపై టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆరా తీస్తున్నది. ఇటీవల డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మస్తాన్‌సాయి హార్డ్‌డిస్క్‌లో భారీగా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు దొరికాయి. ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. గతంలో మస్తాన్‌సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులు నమోదు కాగా.. తాజాగా వారితో పాటు పార్టీలో పాల్గొన్న వారి కోసం ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ? ఎక్కడడెక్కడ పార్టీలు జరుగుతున్నాయి ? అనే కోణంలో టాస్క్‌ఫోర్స్ విచారణ జరుపుతున్నది. త్వరలోనే పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారికి సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోర్టును కోరారు. పోలీసుల పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తే విచారణలో తెలంగాణ న్యాబ్ పోలీసులు సైతం పాల్గొననున్నట్లు సమాచారం. సినీ నటుడు రాజ్‌తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ సాయి, షేక్ ఖాన్ మోహిద్దీన్‌ను నార్సింగి పోలీసులు జనవరి 31న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి తనపై లైంగిక దాడి చేయడంతోనే రాజ్ తరుణ్‌తో విడిపోయినట్లుగా లావణ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్లిన లావణ్య.. అతని వద్ద ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను వెంట తీసుకువచ్చింది. ఇందులో యువతుల వీడియోలతో పాటు డ్రగ్స్ తీసుకున్న వీడియోలున్నట్లు తేలింది. మస్తాన్‌సాయి మొబైల్లో దాదాపు 800 మంది యువతుల వీడియోలు సైతం గుర్తించినట్లు తెలుస్తున్నది. యువతుల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.