హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ వల్ల తలెత్తే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వర్సిటీల్లో యాంటి డ్రగ్ క్లబ్బులను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వాన్ని సంప్రదించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం జేఎన్టీయూలో ‘నార్కోటిక్ డ్రగ్స్ – అనర్థాల’పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సును రాష్ట్ర ఉన్నత విద్యామండలి, పోలీసుశాఖ సహకారంతో నిర్వహించారు. ఇప్పటికే యాంటి ర్యాగింగ్ క్లబ్బులను ఏర్పాటుచేయగా, వీటి తరహాలోనే యాంటి డ్రగ్ క్లబ్బులను అందుబాటులోకి తెస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. డిగ్రీ, పీజీ పుస్తకాల్లో డ్రగ్స్ అనర్థాలను తెలిపేలా పాఠ్యాంశాలను చేర్చాలని గతంలోనే నిర్ణయించగా, తాజాగా క్లబ్బుల ఏర్పా టు అంశాన్ని పరిశీలిస్తున్నారు.