హైదరాబాద్,ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ‘బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాము కృషి చేస్తాం. ఆ మేరకు సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్‌లో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు దిశగా చొరవ చూపుతాం’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వెల్లడించారు. కేంద్రంలో అస్థిరత వచ్చే ప్రమాదం ఉన్నదని, దీనిని అధిగమించాలంటే దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సీపీఐ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో న్యాయవ్యవస్థ అభిమన్యుడిలా పోరాడుతున్నదని, దేశ ప్రజాస్వామ్యాన్ని అంతిమంగా న్యాయవ్యవస్థే కాపాడుతుందనే విశ్వాసం కలుగుతున్నదని పేర్కొన్నారు.
దేశంలో ఎన్నికల కమిషన్‌ను, ఈడీని,. సీబీఐని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకున్నదని, ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికైన గవర్నర్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను శాసిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్డీయే పాలిత ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో తప్ప మిగతా అన్ని రాష్ర్టాల్లో అక్కడి పాలక ప్రభుత్వాలపై గవర్నర్ల చేత దాడి చేయిస్తున్నారని. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను కాపాడుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.