PCB | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు చేపట్టడంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామస్తులు ధ్వజమెత్తారు. తమ గ్రామం సమీపంలోని శ్రీజయ, వినీత్, హజేలో, బృందావన్ ల్యాబొరేటరీలతోపాటు ఆర్కెమిడీస్, వీజే సాయి, కెమిక్ లైఫ్‌సైన్స్, ఎస్వీఆర్, రావూస్, ఆప్టిమస్ పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతున్నదని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ ఆయా కంపెనీలతో కుమ్మక్కై ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా కంపెనీల కాలుష్యంపై ఫిర్యాదు చేసిన అంతమ్మగూడెం గ్రామస్తులు, రైతులతోపాటు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం పీసీబీ సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పీసీబీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు 12 మంది ఫిర్యాదుదారులు సనత్‌నగర్‌కు చేరుకోగా కేవలం ముగ్గురిని మాత్రమే సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించారు.
ఫార్మా పరిశ్రమల కాలుష్యంపై ఇప్పటికే ఎన్నోసార్లు పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నదని, అధికారులు కంపెనీలఖు కొమ్ముకాస్తూ నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.