మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 1 : పంటలు సరిగా పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంతండాలో సోమవారం చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్యా గణేశ్(32) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
గతేడాది ఎకరంలో మిర్చి, మరో ఎకరంలో పత్తి వేయగా.. మిర్చి పంటకు తెగుళ్లు సోకి పూర్తిగా దెబ్బతిని దిగుబడి సరిగా రాలేదు. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం గణేశ్ రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. ఈసారి కూడా మిర్చి పంట వేసేందుకు దుక్కి సిద్ధం చేసి పెట్టుబడి కోసం ఇతరులను ఆశ్రయించాడు.
ఎవరూ ఇవ్వకపోవడంతోపాటు అప్పు ఇచ్చినవాళ్లు అడుగుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన గణేశ్.. రెండ్రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం మహబూబాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోత్స్న, ఇద్దరు పిల్లలు ఉన్నారు.