సిరిసిల్ల రూరల్, జూన్ 21 : సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో నేతకార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పటికే ఆరుగురు నేతకార్మకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కార్మిక క్షేత్రమైన రాజీవ్‌నగర్‌లో కుడిక్యాల నాగరాజు(47) బలన్మరణానికి పాల్పడ్డాడు. నాగరాజుకు భార్య లావణ్య, కొడుకులు లోకేశ్, విఘ్నేష్ ఉన్నారు. నాగరాజు మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య లావణ్య బీడీ లు, మిషన్ కుడుతూ చేదోడుగా ఉంటున్నది. ఆరు నెలలుగా వస్త్ర పరిశ్రమలో పనులు లేక నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. గతంలో ఆయన అనారోగ్యం పాలవ్వగా, రూ.4 లక్షల వరకు వైద్యానికి, ఇతర ఖర్చులకు అప్పు చేశాడు. పెద్ద కొడుకు లోకేశ్ ఇటీవలే పదో తరగతి పాసవగా, ఇంటర్ చదివించాలనుకున్నా డు. కొడుకు పుస్తకాల కోసం సెల్ ఫోన్ అమ్మేశాడు. ఆరు నెలలుగా పనులు లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారడం, చేసిన అప్పులు ఎలా తీర్చాలోనన్న బెంగతో రెండురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు, రాత్రి ఇంటికి చేరా డు. తీవ్ర మనస్తామం చెందిన నాగరాజు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భార్య బయటకు వెళ్లగా బాత్రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యు లు సిరిసిల్ల దవాఖానకు తరలించారు. రాత్రి వేళలో పరిస్థితి మిషమించి మృతి చెందాడు. వరుసగా నేతకార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.