Weaver Worker Commits Suicide | సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 11: సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకుదెరువు కోసం వచ్చి మరుమగ్గాల పని లేకపోవడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగలపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర వాసి వేముల సతీష్ కుమార్ (65) భార్య గతంలో చనిపోయింది. ఇద్దరు కొడుకులు మహారాష్ట్రలో స్థిరపడ్డారు. 20 ఏండ్ల క్రితం ఉపాధి కోసం తంగళ్లపల్లికి వచ్చి అద్దె భవనాల్లో ఉంటూ మర మగ్గాలు నడుపుతూ జీవనం సాగించాడు.
కేసీఆర్ సర్కార్ అధికారంలోకి రాకపోవడంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో పనులు లేక సతీష్ కుమార్ వంటలు చేయడం, బార్లో పనిచేశాడు. పని లేక మనోవేదనకు గురైన సతీష్ కుమార్, తాను అద్దెకు ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రామ్మోహన్ చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్నిపోస్ట్ మార్టం కోసం సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. కాగా సతీష్ కుమార్ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.