మెట్పల్లి రూరల్, డిసెంబర్ 19 : జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. బుధవారం ఓ విద్యార్థికి పాముకాటు వేయగా, తాజాగా గురువారం ఉదయం మరో విద్యార్థిని పాము కాటేసింది. కోరుట్లకు చెందిన బోడ అశ్విత్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం ఉదయం నిద్రలేచిన విద్యార్థికి కుడి అరచేయి, కుడికాలిపై కాట్లు ఉండటంతోపాటు దురద అనిపించడంతో తోటి విద్యార్థులకు, ప్రిన్సిపాల్‌కు తెలిపాడు. వెంటనే కోరుట్ల ప్రభుత్వ దవాఖానలో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేటు దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
కాగా, బుధవారం ఓంకార్ అఖిల్ సైతం పాముకాటుతో అస్వస్థతకు గురై కోరుట్లలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు ఒకే గదిలో నిద్రించిన 8వ తరగతి విద్యార్థులు వరుసగా పాముకాటుకు గురై అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ గురుకుల పాఠశాలను సందర్శించి ఆవరణలో గుంతలను పూడ్చడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించాలని ఆర్డీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థులు గుర్తుతెలియని విషపురుగు కాటుతో అస్వస్థతకు గురయ్యారని, కోరుట్లలోని ప్రైవే టు దవాఖానల్లో చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలిపారు.
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి గురువారం వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పెద్దాపూర్ గురుకులానికి చేరుకుని ఆర్డీవో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మాధవీలతను నిలదీశారు. ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. గతంలోనూ ఇద్దరు మరణించినా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం మారుతీనగర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. కాగా ప్రిన్సిపాల్ మాధవీలతను కలెక్టర్ సస్పెండ్ చేశారు.