నిబంధనల మేరకు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్ట్ సంస్థకు విధించిన భారీ జరిమానాను మాఫీ చేయాలని చూసిన బాగోతం సింగరేణిలో దుమారం రేపింది. శ్రీరాంపూర్ డివిజన్ ఇందారం ఖని ఓపెన్ కాస్ట్ (ఐకే-ఓసీపీ)లో ఓవర్‌బర్డెన్ (ఓబీ) తొలగింపు కాంట్రాక్టు పొందిన ఓసంస్థ నుంచి పెనాల్టీ రూపంలో రావాల్సిన రూ. 25 కోట్లు మాఫీ చేసేందుకు రచించిన పథకం సింగరేణిలో పెను సంచలనమైంది. సదరు కాంట్రాక్టు సంస్థ.. అధికార పార్టీలోని ఓ బడా నేత బంధువుది కావడంతో అధికారులు మాయజేయ జూసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
కరీంనగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గోదావరిఖని : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో మరో భారీ ఆర్థిక కుంభకోణం బయటపడింది. శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారంఖని ఓపెన్ కాస్ట్ (ఐకే-ఓసీపీ) ప్రాజెక్టులో ఓవర్‌బర్డెన్ (ఓబీ) తొలగింపు కాంట్రాక్టు పొందిన ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి పెనాల్టీ రూపంలో రావాల్సిన రూ.25 కోట్లు మాఫీ చేసేందుకు పెద్ద పథకం రచించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సింగరేణిలో పెను సంచలనమై, హాట్‌టాపిక్‌గా మారింది. సదరు కాంట్రాక్టు సంస్థ.. అధికార పార్టీలోని ఓ బడా నేతకు సంబంధించిన బంధువుది కావడంతో ఉన్నతస్థాయి అధికారులు ఆ రూ.25 కోట్లు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
అందుకోసం పకడ్బందీ ప్లాన్ వేసి, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం ఏమీలేదని చూపించేందుకు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారితో కమిటీ వేసి, వారికి అనుగుణంగా రిపోర్టు తెప్పించుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం సింగరేణి విజిలెన్స్ దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన సదరు అధికారులు, పక్కాగా విచారణ చేసి తప్పు కాంట్రాక్టర్‌దేనని నిగ్గుతేల్చడంతోపాటు పెనాల్టీ వసూలు చేయాల్సిందేనంటూ నివేదికను పై అధికారులకు సమర్పించారు. విజిలెన్స్ నివేదికతో షాక్‌తిన్న సదరు ఉన్నతాధికారులు, ఏకంగా నిగ్గుతేల్చిన విజిలెన్స్ అధికారిని బదిలీచేయడంతోపాటు ఆ నివేదికను తొక్కిపెట్టి, కాంట్రాక్టర్‌కు మేలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
సింగరేణి సంస్థ ఇందారంఖని ఓసీలో బొగ్గుపై కప్పబడి ఉండే ఓవర్‌బర్డెన్ (మట్టి ) తొలగింపు పనులను ‘వరాహ జీకేఆర్ జేవీ’ అనే సంస్థకు అప్పగించింది. నిబంధనల ప్రకారం నిర్ణీత కాలంలో పూర్తి చేయాల్సిన పనుల్లో ఈ జేవీ సంస్థ 30% మాత్రమే పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. ఈ వైఫల్యం కారణంగా సింగరేణి సంస్థకు (10 లక్షల) ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లింది. దీంతో సంస్థకు వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం ఏర్పడింది. నిబంధనల ప్రకారం సదరు కాంట్రాక్టు సంస్థ, నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయకపోవడం వల్ల సింగరేణికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ సదరు కాంట్రాక్టు సంస్థపై రూ.25 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. నిర్లక్ష్యానికి మూల్యంగా పెనాల్టీ చెల్లించాల్సిందేనంటూ సింగరేణి ముందుగా తేల్చిచెప్పింది.
మరోవైపు, ఈ వ్యవహారంపై రహస్య ఫిర్యాదు అందుకున్న సింగరేణి విజిలెన్స్ కూపీలాగింది. లోతుగా వెళ్లి విచారణ చేసింది. సదరు విజిలెన్స్ ఉన్నతాధికారి దర్యాప్తును ఆపాలని పలువురు పైస్థాయి అధికారులు, అధికార పార్టీ నేతలు ప్రయత్నించినా.. వాటిని అధిగమించి విజిలెన్స్ విభాగం విచారణ పూర్తి చేసి, దర్యాప్తులో భాగంగా సంచలనాత్మక విషయాలు బయట పెట్టినట్టు తెలుస్తున్నది. ఓబీ తొలగింపులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నదని, దీనివల్లే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికి భారీగా నష్టం వాటిల్లిందని విజిలెన్స్ తేల్చినట్టు సమాచారం. ఆ నివేదికను విజిలెన్స్ విభాగం పై స్థాయి అధికారులకు పంపించింది. దీంతో రూ.25 కోట్లు మాఫీ చేయడానికి విజిలెన్స్ నివేదిక అడ్డుగా ఉన్నదని భావించిన ఓ ఉన్నతాధికారి, అధికార పార్టీ నేతలు కలిసి ఆ నివేదికను బయటకు రాకుండా తొక్కిపెటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ సంస్థకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిన సదరు విజిలెన్స్ అధికారిని బదిలీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ బదిలీ వెనుక కాంట్రాక్ట్ సంస్థకు కొమ్ముకాస్తున్న సింగరేణిలోని ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సింగరేణి సంస్థలో ఇటీవలే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్.. సంస్థలో జరుగుతున్న పరిణామాలతోపాటు గతంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన బలరాం హయాంలో జరిగిన ఘటనలపై దృష్టి సారిస్తారా? లేదా? అన్న అంశంపై సింగరేణి వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అందులోనూ రూ.25 కోట్లు మాఫీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు, విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టిన తీరు, సదరు అధికారి బదిలీ వంటి అంశాలను లోతుగా చూస్తారా? లేదా? అన్న చర్చ ప్రస్తుతం కార్మిక యూనియన్లలో సాగుతున్నది. ఇదిలాఉండగా సింగరేణిలో రాజకీయ జోక్యం రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కాంట్రాక్టు సంస్థ నిజామాబాద్‌కు చెందిన ఒక కాంగ్రెస్ కీలక నాయకుడి బంధువుకు సంబంధించినదని అత్యంత విశ్వసనీయ సమాచారం. దీంతో పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం సింగరేణిలోని ఒక అగ్రస్థాయి అధికారి సదరు కాంట్రాక్ట్ సంస్థను కాపాడేందుకు రంగంలోకి దిగారు. రూ.25 కోట్ల జరిమానాను ఎలాగైనా మాఫీ చేయాలనే లక్ష్యంతో పకడ్బందీగా ప్లాన్ వేసి.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఓ కమిటీని ఏర్పాటుచేశారు. ఆ కమిటీ ఓబీ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. నిజానికి ఇంత ప్రాధాన్య అంశంపై విచారణ చేయాల్సి వచ్చినప్పుడు అవినీతి మరకలేని, నిజాయితీపరులైన అధికారులతో కమిటీ వేయాలి.
కానీ, గతంలో శ్రీరాంపూర్‌లో జరిగిన కోట్లాది రూపాయల డీజిల్ కుంభకోణంతో సంబంధం ఉన్న జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని ఈ కమిటీకి హెడ్‌గా నియమించడం గమనార్హం. నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన రిటైరయ్యారు. ఓవర్ బర్డెన్ (మట్టి) తొలగింపు కాంట్రాక్టు విషయంలో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా తప్పుడు నివేదిక ఇచ్చేందుకు ‘ఫోర్స్ మేజర్’ (అనివార్య కారణాలు) అనే నిబంధనను వాడుకుంటూ జరిమానాను మాఫీ చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ ఏర్పాటుకు ముందే నివేదిక ఎలా ఉండాలన్నది డిజైన్ చేశారని, అందుకు అనుగుణంగానే రూ.25 కోట్ల పెనాల్టీ మాఫీకి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.