Dandumalkapur Industrial Park | హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్న వేళ రాష్ట్రంలో మరో అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి రాబోతున్నది. మరీ ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం కానుంది. హైదరాబాద్ శివారులోని దండుమల్కాపూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ‘ప్లగ్ అండ్ ప్లే’గా రూపుదిద్దుకుంటున్న ఈ పార్క్‌కు ఉత్త చేతులతో వచ్చి పరిశ్రమను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఇక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు లభించనున్నాయి.
ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఐదేండ్ల వరకు రూపాయికే యూనిట్ విద్యుత్తు, పెట్టుబడిలో 15శాతం రాయితీ సహా మరెన్నో ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ పార్క్ ద్వారా రూ. 5వేల కోట్ల పెట్టుబడులు, 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేశారు. దీనికి సమీపంలోనే 100 ఎకరాల్లో టాయ్స్ పార్క్ రూపుదిద్దుకుంటున్నది. తాజాగా, ఇదే ప్రాంతంలో ఎంఎస్ఎంఈల కోసం మరో 100 ఎకరాల్లో ఈ ప్లగ్ అండ్ ప్లే పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది పూర్తయితే రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తింపు పొందుతుంది.
56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌లో 56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ పార్క్‌లో 2,600 యూనిట్లు ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు తమ అవసరాలకు తగ్గట్టుగా స్పేస్‌ను కొనుగోలు చేసుకుని ఉత్పత్తి ప్రారంభించవచ్చు. పార్క్‌లో విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరాతోపాటు ఉద్యోగులు, కార్మికుల నివాస సముదాయాలు, ట్రక్ పార్కింగ్, లోడింగ్, అన్‌లోడింగ్‌కు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంఎస్ఎంఈల కోసం తొలిసారి
జహీరాబాద్‌లో ఈవీ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో తొలిసారి ఎంఎస్ఎంఈ యూనిట్ల కోసం ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ప్లగ్ అండ్ ప్లే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అవుతుందని చెబుతున్నారు. ఇక్కడికి ఖాళీ చేతులతో వచ్చి బ్యాంకుల నుంచి రుణం తీసుకుని మిషనరీ ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి ప్రారంభించుకోవచ్చు. భూసేకరణ, షెడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయల కల్పన వంటి తిప్పలు తప్పుతాయి. ఇక్కడ ఇప్పటికే 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో 100కుపైగా పరిశ్రమలు కొలువుదీరాయి. ఈ పార్క్‌లో పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలంటే తొలుత భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా రూపుదిద్దుకుంటున్న ప్లగ్ అండ్ ప్లే పార్క్‌లో మాత్రం నేరుగా నచ్చిన చోట ఇండస్ట్రీ ప్రారంభించుకోవచ్చు.

రాయితీలు.. సౌకర్యాలు ఇలా