మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతామని మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ సీ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం వారు మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడారు. కృష్ణాబోర్డు, ట్రిబ్యునల్ ఆదేశాలు లేకుండా ఎలా కడతారని ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సాగు నీళ్లు కాదు, తాగడానికి కూడా నీళ్లు ఉండవని, అందుకోసం అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కర్ణాటక జల దోపిడీతో పాలమూరు ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం కోసం దాదాపు 1.5 లక్షల ఎకరాల భూమిని సేకరించి.. ఇప్పుడున్న ఎత్తుకంటే 100 టీఎంసీల నీళ్లు అదనంగా నిలిపే విధంగా నిర్మిస్తున్నారని, ఇది గనక పూర్తయితే చుక్క నీరు కూడా కిందికి వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కృష్ణా వాటర్ బోర్డు తేల్చకముందే.. ట్రిబ్యునల్ తీర్పు రాకముందే.. ఎగువన ఉన్న రాష్ర్టాలు ఎక్కడికక్కడ నీళ్లు తీసుకుపోతే ఎలా అని ప్రశ్నించారు.
ఆల్మట్టి ఎత్తుపై పార్టీలకతీతంగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం వారితో మాట్లాడి ఎత్తు పెంచకుండా చొరవ చూపాలన్నారు. డ్యాం ఎత్తు పెంపును ఆపే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తామని తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగానూ ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తయితే రెండేండ్లుగా పనులు పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామని, ప్రభుత్వానికి గడువు ఇచ్చి పండుగల తరువాత కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.