దమ్మపేట రూరల్, ఏప్రిల్ 16 : కాలం కలిసి రాక.. అప్పులు తీర్చలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన రైతు మడిపల్లి శ్రీనివాసరావు (47) తనకున్న ఐదెకరాలతోపాటు 30 ఎకరాలు కౌలు కు చేస్తున్నాడు. చెరుకు, వరి, ఆయిల్ పామ్ పంటలు సాగుచేస్తున్నాడు. ఆశించిన దిగుబడులు రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో రూ.కోటికిపైగా అప్పులయ్యాయి. అటు వ్యవసాయం కలిసిరాక.. ఇటు తెచ్చిన అప్పులు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన శ్రీనివాసరావు మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో కలుపుమందు తాగాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే శ్రీనివాసరావు మృతిచెందినట్టు తెలిపారు. శ్రీనివాసరావు గతంలో మందలపల్లి ఎంపీటీసీగా ఎన్నికై మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.