కౌడిపల్లి, నవంబర్ 24: బోరు ఫెయిల్ కావడం, దిగుబడులు లేకపోవడంతో చేసిన అప్పులు భారమై ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన రైతు చంది షేకులు (49) వ్యవసాయం చేస్తున్నాడు. సాగు కోసం వేసిన బోరు ఫెయిల్ అయ్యింది. ఎకరం పొలంలో వరి వేసిన సరైన దిగుబడి రాలేదు. సాగు కోసం, కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.5 లక్షల అప్పు అయ్యింది. వీటిని తీర్చే మార్గం లేక ఈ నెల 21న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని వివిధ దవాఖానలకు తరలించి వైద్యం చేయించారు. పరిస్థితి మరింత విషమించడంతో ఈనెల 22న గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కౌడిపల్లి ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు.