ఆదిలాబాద్: రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతు ఉరికొయ్యలను ఎక్కుతున్నారు. ఆదిలాబాద్లో మరో రైతు బలవన్మరణం చెందారు. జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్కు చెందిన మామిళ్ల నర్సయ్య (55) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ అవ్వక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో తన వ్యవసాయ భూమి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని చనిపోయారు.
తనకున్న ఆరు ఎకరాల్లో పత్తి, కంది పంటలు సాగుచేశాడని, దిగుబడులు సరిగా రాకపోవడంతో నష్టపోయాడని స్థానికులు తెలిపారు. అతనికి ఇచ్చోడ ఎస్బీఐలో రూ.2.20 లక్షల అప్పుతోపాటు మరో రూ.3 లక్షల వరకు బాకీలు ఉన్నాయని వెల్లడించారు.
శుక్రవారం వనపర్తి జిల్లాలో ఒక రైతు మరణించిన విషయం తెలిసిందే. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామానికి చెందిన ఖాజాపాషా (43)కు ఇద్దరు సోదరులు. మొత్తం కలిపి వీరి తల్లి పేరిట రెండెకరాల పొలం ఉన్నది. ఇందులోనే వారు పంటలు సాగుచేస్తూ కుటుంబ పోషణ కొనసాగించారు. ఎక్కువగా వరి సాగు చేసేటోళ్లు. నిరుడు వరి దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా వ్యవసాయంతోపాటు పాడిని ఎంచుకున్నారు. ఇందుకోసం రూ.6 లక్షలు వెచ్చించి ఐదు గేదెలను కొనుగోలు చేశాడు. ఇది కూడా లాభసాటిగా లేకపోవడంతో దిగాలు చెందేవాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం మధ్యాహ్నం తన పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య ఫాతిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.