బల్మూరు, నవంబర్ 19: అప్పుల బాధలు భరించలేక మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బాలస్వామి, వెంకటమ్మ దంపతులు. వీరి కూతురు శివమ్మను అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు ఇచ్చి 20 ఏండ్ల కిందట పెండ్లి చేశారు. నాటి నుంచి శ్రీనివాసులు ఇల్లరికం అల్లుడిగా వీరి వద్దే ఉంటున్నాడు. రెండున్నరేండ్ల కిందట శివమ్మ కూతురు శ్రావణి పెండ్లి కోసం బాలస్వామి రూ.12 లక్షలు అప్పు చేశాడు. వారికి నాలుగెకరాల పొలం ఉంది. అందులో ఐదు బోర్లు వేసేందుకు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ మొత్తం అసలు, వడ్డీతో కలిపి రూ.20 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది వానకాలంలో మొక్కజొన్న వేయగా.. వర్షాలు బాగా కురిసి పంట దెబ్బతిన్నది. ఆ తర్వాత వరి సాగు చేశాడు. ఆశించిన మేర పంటల దిగుబడి రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనోవేదనకు గురై సోమవారం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి చెరువు వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు.