దుండిగల్, అక్టోబర్14: కాంగ్రెస్ సర్కా ర్ హయాంలో మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఓ పేదింటి రైతు మనస్తాపానికి గురై బలవన్మరణం చేసుకోబోగా, అక్కడికి వచ్చిన వారు ప్రాణాపాయం నుంచి కాపాడారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ-దుండిగల్ మండలం దుండిగల్ తండా-2కు చెందిన సిద్ధూ అనే రైతు.. తన భూమికి పాస్ పుస్తకం ఇవ్వాలంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులను వేడుకున్నాడు. మంగళవారం కూడా గండిమైసమ్మ-దుండిగల్ మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన ఆయన విసిగి వేసారి ఆత్మహత్యే శరణ్యమని అనుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, కార్యాలయానికి వచ్చిన ప్రజలు మంటలను ఆర్పి, ప్రాణాపాయం నుంచి కాపాడారు.
అనంతరం రైతు సిద్ధూ మీడియాతో తన గో డు వెల్లబోసుకున్నాడు. తమకు గాగిళ్లాపూర్లోని సర్వేనంబర్ 148, 150లో కేవలం 14గుంటల భూమి ఉన్నదని, అదే తమ జీవనాధారం అని తెలిపాడు. ఆ భూమికి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. తమ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటికీ పట్టాలు ఇచ్చిన అధికారులు తమకు మాత్రం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. గతంలో ఇదే భూమికి పట్టాలివ్వాలని తన అన్న అధికారులను కోరితే, రూ.6 లక్షలు లంచం అడిగారని, అది తట్టుకోలేకే తన అన్న ఆనాడే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. తనకూ ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశాడు. తహసీల్దార్ తనకు పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వకుండా రెండేండ్లుగా వేధిస్తున్నాడని ఆరోపించాడు. తమ భూమిని ఓ బడా నిర్మాణసంస్థకు కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశాడు. కోర్టు సైతం దానిని తమ భూమిగానే నిర్ధారించిందని వాపోయాడు.